T20 WC 2022: Rohit Sharma Poor Performance In Last 20 Matches In T20 Innings - Sakshi
Sakshi News home page

టీమిండియాకు రోహిత్‌ శర్మ భారమవుతున్నాడా..?

Published Mon, Oct 31 2022 9:48 PM | Last Updated on Tue, Nov 1 2022 8:35 AM

T20 WC 2022: Rohit Sharma Performance In Last 20 T20 Innings - Sakshi

రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈసారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీ సాధించాలన్న కృత నిశ్చయంతో టీ20 వరల్డ్‌కప్‌-2022 బరిలోకి దిగింది. ఈ క్రమంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయాలు (పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌) సాధించినప్పటికీ.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ మినహా జట్టు మొత్తం అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది.

ముఖ్యంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ విభాగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ సహా టాపార్డర్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యాన్ని చాలామంది కేఎల్‌ రాహుల్‌ ఒక్కరి వరకే పరిమితం చేస్తున్నారు.

ఇక్కడ మనం గమనించాల్సిన భయంకరమైన నిజం మరొకటి దాగి ఉంది. అదేంటంటే.. బ్యాటింగ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఘోర వైఫల్యాలు. గణాంకాలపై ఓ లుక్కేస్తే.. ఈ ఏడాది హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు ఆడిన 20 టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 3 అర్ధసెంచరీలు మాత్రమే సాధించాడు. అందులో ఒకటి బలహీనమైన నెదర్లాండ్స్‌పై (53) సాధించినది కాగా.. మరో రెండు శ్రీలంక(ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో 72), వెస్టిండీస్‌ (విండీస్‌ పర్యటనలో 64)లపై సాధించినవి.

ఈ మూడు అర్ధసెంచరీలు మినహా రోహిత్‌ గత 20 ఇన్నింగ్స్‌ల్లో సాధించింది ఏమీ లేదు. అతి కష్టం మీద రెండంకెల స్కోర్‌ చేరుకుంటున్నాడే తప్ప.. జట్టు కోసం ఏ ఒక్క సందర్భంలోనూ ప్రయోజనకరమైన ఇన్నింగ్స్‌ ఆడింది లేదు. చెత్త షాట్‌ సెలెక్షన్లతో వికెట్‌ సమర్పించుకుంటూ టెక్నిక్‌ పరంగానూ దారుణం అనిపించుకుంటున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు రాణిస్తుండటంతో జట్టు మ్యాచ్‌లు గెలుస్తుంది కాబట్టి.. జనాల ఫోకస్‌ రోహిత్‌పై పడలేదు కానీ, అతని గత 20 ఇన్నింగ్స్‌ల్లో గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఇక్కడ మరో విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తే.. కెప్టెన్సీ విషయంలోనూ హిట్‌మ్యాన్‌ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. మైదానంలో కలిసి కట్టు నిర్ణయాలు లేదా ఎవరో ఒకరి నిర్ణయంపై ఆధారపడటం, ఫీల్డ్‌లో యాక్టివ్‌గా లేకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం.. ఇలా చాలా విషయాల్లో హిట్‌మ్యాన్‌ అప్‌ టు ద మార్క్‌ లేడని సుస్పష్టం అవుతుంది.

ఇవి కాదని ఫీల్డ్‌లో బద్ధకంగా ఉండటం.. చీటికి మాటికి సహచరులపై కస్సుబుస్సులాడటం.. కెప్టెన్‌ స్థాయి కాదని విశ్లేషకులు అభిప్రాయం. ఈ పరిస్థితుల నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ జట్టుకు భారంగా మారుతున్నాడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జట్టు గెలుపు ట్రాక్‌లో ఉన్నంత కాలం అంతా సాఫీగానే నడిచినప్పటికీ, ఒక్కసారిగా ట్రాక్‌ త​ప్పిందంటే హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిత్‌ ఇకనైనా తేరుకుని, బ్యాటింగ్‌ లోపాలను సరిదిద్దుకుని పూర్వవైభవాన్ని సాధించాలని ఆశిద్దాం.

రోహిత్‌ శర్మ గత 20 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన స్కోర్ల వివరాలు..

టీ20 వరల్డ్‌కప్‌-2022లో
సౌతాఫ్రికాపై 15, 
నెదర్లాండ్స్‌పై 53,
పాకిస్తాన్‌పై 4

స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌లో 0, 43, 0

స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో 17, 46, 11

ఆసియా కప్‌లో 
సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై 72
పాకిస్తాన్‌పై 28
హాంగ్‌కాంగ్‌పై 21
పాకిస్తాన్‌పై ఆరంభ మ్యాచ్‌లో 12

వెస్టిండీస్‌ పర్యటనలో 33, 11, 0, 64

ఇంగ్లండ్‌ పర్యటనలో 11, 31, 24


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement