ద్వైపాక్షిక సిరీస్‌లలో తిరుగులేని జట్టుగా అవతరించిన భారత జట్టు.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం బోల్తా పడుతోంది. ఐసీసీ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుని దాదాపు పదేళ్లు కావస్తోంది. చివరిగా 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఐసీసీ ట్రోఫీ భారత జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ఇక ఎన్నో అంచనాలతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోకి బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్లోనే తమ ప్రయాణాన్ని ముగించింది. మరోసారి ఐసీసీ టోర్నీల్లో నిరాశపరిచిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వర్షం కురిసింది. భారత ఆటగాళ్లు తమ జట్టు కంటే ఐపీఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఆటగాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ చేరాడు. జట్టులో స్ధిరత్వం లేకపోవడమే టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ ఇంటిముఖం పట్టింది అని ఆయన అభిప్రాయపడ్డాడు.
స్పోర్ట్స్ కీడాతో లాడ్ మాట్లాడుతూ.. గత ఏడు- ఎనిమిది నెలల్లో భారత జట్టులో స్ధిరత్వం లేదు. ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీకి సిద్ధమైనప్పడు.. అందుకు తగ్గట్టు జట్టును తయారు చేసుకోవాలి. గత ఏడు నెలలో భారత ఇన్నింగ్స్‌ను ఒక్కోసారి ఒక్కొక్కరు ప్రారంభించారు. బౌలింగ్ విభాగంలో కూడా ప్రతీ సిరీస్‌కు బౌలర్లు మారుతునే ఉన్నారు. పనిభారం పేరుతో ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామంటున్నారు.
ప్రపంచ క్రికెట్‌లో మిగితా ఆటగాళ్లకు లేని వర్క్‌లోడ్ కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే ఉందా? ఒక వేళ పనిభారం ఎక్కవైతే ఐపీఎల్‌లో ఎందుకు ఆడుతున్నారు? మీరు ప్రపంచకప్ గెలవాలనుకుంటే ఐపీఎల్ ఆడకండి. వాళ్లు ప్రొఫెషనల్ క్రికెటర్లు కాబట్టి ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలి అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment