
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(PC:IPL.com)
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై బాధలో ఉన్న ముంబైకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది సీజన్‌లో మరి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
అతడు ఇప్పటిలో జట్టుతో చేరేలా సూచనలు కన్పించడం లేదు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సూర్య పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరి కొన్ని రోజుల పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
సూర్య చాలా త్వరగా కోలుకుంటున్నాడు. అతడు అతి త్వరలోనే ముంబై జట్టుతో కలవనున్నాడు. అయితే మొదటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయిన సూర్య.. మరి కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే ఛాన్స్ ఉందని బీసీసీఐ సీనియర్ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సూర్యలేని లోటు ముంబై జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది.
ఇక గతేడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి సూర్య మళ్ళీ మైదానంలో కనిపించలేదు. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.