టీ20 బ్లాస్ట్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ (ఐపీఎల్) ఆల్‌రౌండర్, ఎస్సెక్స్ ఫాస్ట్ బౌలర్, ఆసీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న (జూన్ 18) మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్స్ 24 బంతుల్లో 8 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 67 పరుగులు చేశాడు. సామ్స్ సిక్సర్ల సునామీలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం తడిసిముద్ద అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సామ్స్.. ఆ తర్వాత 3 బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టి ఔటయ్యాడు.
సామ్స్‌కు జతగా డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మైఖేల్ పెప్పర్ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్సెక్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మిడిల్‌సెక్స్ భారీ లక్ష్య ఛేదనకు దిగగా వర్షం అంతరాయం కలిగించింది. 12.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఎస్సెక్స్‌ను విజేతగా ప్రకటించారు.
ఆ సమయానికి మిడిల్‌సెక్స్ 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ సమీకరణల ప్రకారం మిడిల్‌సెక్స్ లక్ష్యానికి ఇంకా 22 పరుగులు వెనుకపడి ఉండింది. దీంతో అంపైర్లు ఎస్సెక్స్‌ను విజేతగా ప్రకటించారు. మిడిల్‌సెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీఫెన్ ఎస్కినాజీ (28), ర్యాన్ హిగ్గిన్స్ (32) ఓ మోస్తరు పరుగులు చేయగా.. జో క్రాక్‌నెల్ (36 నాటౌట్), మ్యాక్స్ హోల్డన్ (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన డేనియల్ సామ్స్ ఓ వికెట్ దక్కంచుకోగా.. డేనియల్ లారెన్స్ మరో వికెట్ పడగొట్టాడు.
కాగా, 31 ఏళ్ల డేనియల్ సామ్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. 2022 సీజన్‌లో అతను ఎంఐ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. 2023 వేలంలో సామ్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 75 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను లక్నో తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Comments
Please login to add a commentAdd a comment