IND vs ZIM, 1st ODI: Deepak Chahar Says Selection For The T20 World Cup 2022 Is Not In My Hands - Sakshi
Sakshi News home page

Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు!

Published Fri, Aug 19 2022 11:53 AM | Last Updated on Fri, Aug 19 2022 12:27 PM

T20 WC 2022: Deepak Chahar Solid Comeback But That Is Not In My Hand - Sakshi

Ind Vs Zim 1st ODI- Deepak Chahar- T20 World Cup 2022: ‘‘మనం చాలా కాలం పాటు జట్టుకు దూరమైతే.. ఇతరులు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. ఒకవేళ వాళ్లు మెరుగ్గా రాణించినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. ఒకవేళ మనం మళ్లీ టీమ్‌లోకి తిరిగి రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మెరుగైన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. కాబట్టి చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చినపుడు కచ్చితంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాపై కూడా చాలా అంచనాలే ఉన్నాయి. వాటిని ఎలా అందుకోవాలన్న అంశం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. మిగతా విషయాల్లో నేనేమీ చేయలేను’’ అని టీమిండియా పేసర్‌ దీపక్‌ చహర్‌ అన్నాడు. 


deepak chahar(PC: BCCI)
    
అదిరిపోయే రీఎంట్రీ!
గాయాల కారణంగా దీపక్‌ చహర్‌ దాదాపు ఆర్నెళ్ల పాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ సాధించిన అతడు జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. ఇందులో భాగంగా హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) జరిగిన మొదటి వన్డేలో ఆడిన చహర్‌.. 7 ఓవర్ల బౌలింగ్‌లో 27 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

తద్వారా ఆతిథ్య జింబాబ్వేను 189 పరుగులకే కట్టడి చేసి.. ఆపై టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు చహర్‌. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరమైన చహర్‌కు ఆసియా కప్‌-2022కు ప్రకటించిన ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. 30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు సెలక్టర్లు. 


deepak chahar(PC: BCCI)

వాళ్లకు అవకాశాలు
అదే సమయంలో జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌ వంటి యువ ఆటగాళ్లు మాత్రం ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో చహర్‌ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. జట్టుకు దూరమైన కారణంగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోవడం వల్లే తాను సెలక్ట్‌ కాలేకపోయానని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు కదా!
ఇక ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముగిసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు ఆడనుంది టీమిండియా. ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్‌ టీ20 వరల్డ్‌కప్‌-2022 బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో జట్టులో స్థానం కోసం పోటీపడటం మాత్రమే తన చేతుల్లో ఉందని.. అంతేతప్ప జట్టుకు ఎంపికవుతానా లేదా అన్నది తన ఆధీనంలో ఉన్న విషయం కాదని చెప్పుకొచ్చాడు చహర్‌. 

అదే విధంగా... జింబాబ్వేతో తొలి వన్డేలో తాను విజయవంతం కావడంపై స్పందిస్తూ.. ఏడు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫిట్‌నెస్‌ సాధించడానికి.. ఆటను మెరుగుపరచుకోవడానికి కఠిన శ్రమకోర్చానని.. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని తెలిపాడు చహర్‌. ఇక టీమిండియా- జింబాబ్వే మధ్య హరారే వేదికగా శనివారం(ఆగష్టు 20) రెండో వన్డే జరుగనుంది. 

చదవండి: Babar Azam: భారత్‌పై గెలుపొక్కటే కాదు.. ఆసియా కప్‌ కొట్టాలని కంకణం!
KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement