
T20 World Cup 2022- 5 Best Matches So Far: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లు చూశాం. తొలి రౌండ్ నుంచి సూపర్-12 దశలో ఇప్పటి వరకు ఐర్లాండ్, జింబాబ్వే సంచలనాలు నమోదు చేయగా.. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లు కుదేలైన తీరును గమనించాం.
మరికొన్ని మ్యాచ్‌లలో జట్ల కంటే వరణుడే హైలెట్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్రూప్-1లో కీలక జట్లైన ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ వర్షార్పణం కావడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో.. ఇప్పటి దాకా ఫైనల్ ఓవర్ థ్రిల్లర్లలో టాప్-5 మ్యాచ్‌లను ఐసీసీ తాజాగా వెల్లడించింది. అవేమిటో ఓసారి పరిశీలిద్దాం.
1. ఇండియా వర్సెస్ పాకిస్తాన్(గ్రూప్-2)
సూపర్-12లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ అక్టోబరు 23న మెల్‌బోర్న్ వేదికగా అక్టోబరు 23న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.
2. పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే(గ్రూప్-2)
టీమిండియా చేతిలో దెబ్బతిన్న పాకిస్తాన్‌కు జింబాబ్వే కూడా కోలుకోని షాకిచ్చింది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమన్న మాటను నిజం చేస్తూ ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే గెలుపొందింది.
పాక్ మూలాలున్న సికందర్ రజా కీలక సమయంలో రాణించి బాబర్ ఆజం బృందానికి ఊహించని షాకిచ్చాడు. దీంతో సూపర్-12లో పాకిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. కాగా జింబాబ్వే చేతిలో అక్టోబరు 27న పాక్ పరాభవానికి పెర్త్ స్టేడియం వేదికైంది.
3. స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్
ఫస్ట్ రౌండ్‌లో భాగంగా బెలెరివ్ ఓవల్ మైదానంలో స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య అక్టోబరు 19న మ్యాచ్ జరిగింది. ఒకానొక దశలో 61/4తో కష్టాల్లో కూరుకుపోయిన ఐర్లాండ్.. కర్టిస్ కాంఫర్ అద్భుత ఇన్నింగ్స్‌తో(72- నాటౌట్) తిరిగి పుంజుకుంది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే స్కాట్లాండ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
4. యూఏఈ వర్సెస్ నెదర్లాండ్స్
టోర్నీ ఆరంభ తేదీ అక్టోబరు 16న నెదర్లాండ్స్, యూఏఈ మధ్య మ్యాచ్ సైతం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ ఎడ్‌వర్డ్స్ సింగిల్ తీయడంతో డచ్ జట్టు విజయం ఖరారైంది. 3 వికెట్ల తేడాతో యూఏఈపై నెదర్లాండ్స్ గెలుపొందింది.
5. నమీబియా వర్సెస్ యూఏఈ
జీలాంగ్ వేదికగా అక్టోబరు 20న గ్రూప్-ఏలో ఉన్న నమీబియా- యూఏఈ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. సూపర్-12 చేరాలన్న నమీబియా ఆశలపై నీళ్లు చల్లిన యూఏఈ జట్టు.. నెదర్లాండ్స్‌కు సూపర్-12 బెర్త్‌ను ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ .. నమీబియాపై 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఫస్ట్ రౌండ్‌లోనే నమీబియా కథ ముగిసింది.
చదవండి: T20 WC 2022 NZ Vs SL: కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్
T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు
Comments
Please login to add a commentAdd a comment