రసవత్తరంగా సాగిన టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్ పోటీలు ఇవాల్టితో ముగిశాయి. ఈ గ్రూప్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి. ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక.. నెదర్లాండ్స్‌పై, యూఏఈ.. నమీబియాపై విజయం సాధించి సూపర్-12 బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
ఈ రెండు మ్యాచ్‌ల్లో ఇద్దరు ఆటగాళ్లు కనబర్చిన అద్భుత పోరాటపటిమ యావత్ క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. శ్రీలంకతో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డెర్ మెర్వ్ భరించలేని నొప్పితో బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకోగా.. యూఏఈతో మ్యాచ్‌లో నబీమియా ఆటగాడు డేవిడ్ వీస్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి.. అభిమానులచే శభాష్ యోధుడా అనిపించుకున్నాడు.
అయితే డేవిడ్ వీస్ వీరోచిత పోరాట పటిమ కనబర్చినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం అతను తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు. ఈ దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. వీస్ తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు పోరాడి ఆఖరి ఓవర్‌లో వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా మ్యాచ్ ఓడటంతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
37 ఏళ్ల వీస్‌కు ప్రస్తుత ప్రపంచకప్‌లో తన జట్టును ఎలాగైనా సూపర్ 12 దశకు చేర్చాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు. ఈ క్రమంలో నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకిచ్చింది. ఈ గెలుపులో వీస్ కీలకపాత్ర పోషించాడు. వయసు పైబడిన రిత్యా వీస్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వీస్ కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫలితంగా నమీబియా 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహ్మద్ వసీమ్ (50), రిజ్వాన్ (43 నాటౌట్), బాసిల్ హమీద్ (25 నాటౌట్) రాణించగా.. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వీస్ (55) ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment