సహచర ఆటగాళ్లతో బాబర్ ఆజం(PC: PCB)
T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-3లో ఉన్న ఈ స్టార్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్‌లో చేసిన మొత్తం పరుగులు 68 మాత్రమే! ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి ఇలా నామమాత్రపు స్కోరుకే పరిమితమైన బాబర్ ఆజం.. కెప్టెన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
విమర్శల జల్లు!
ముఖ్యంగా.. ఫైనల్లో శ్రీలంక చేతిలో పాక్ ఓటమి కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అభిమానులు సహా ఆ జట్టు మాజీ క్రికెటర్లు తమ సారథి తీరుపై మండిపడ్డారు.
ఇక ఆసియాకప్- 2022లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న పాకిస్తాన్ ప్రస్తుతం.. అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
బాబర్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. బాబర్ ఆజం భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీలో గనుక పాక్ జట్టు రాణించకపోతే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మాజీ లెగ్ స్పిన్నర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బాబర్ ఆజం ప్రస్తుతం ఫామ్‌లో లేడు. అతడి కెప్టెన్సీపై కూడా విమర్శలు వస్తున్నాయి.
అలా అయితే కెప్టెన్సీ కోల్పోతాడు!
నాకు తెలిసి కెప్టెన్‌గా బాబర్‌కు ఇదే ఆఖరి అవకాశం. ఒకవేళ ప్రపంచకప్‌లో పాక్ మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే.. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే అతడు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.
బాబర్ గొప్ప క్రికెటర్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులు మాత్రం అతడికి అనుకూలంగా లేవు’’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో కెప్టెన్‌గా తన పాత్ర కూడా ఉంటుందని.. కాబట్టి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా బాబర్ జవాబుదారీగా ఉండక తప్పదని పేర్కొన్నాడు.
ఓపెనర్‌గా వద్దు!
అదే విధంగా.. ఓపెనర్‌గా విఫలమవుతున్న కారణంగా బాబర్ ఆజం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో తన స్థానాన్ని మార్చుకుంటే బాగుంటుందని డానిష్ కనేరియా సూచించాడు. ‘‘మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం స్ట్రైక్ రేటు ఆందోళన కలిగించే అంశం. పవర్‌ప్లేలో ఉండే సౌలభ్యాన్ని కూడా వారు వినియోగించుకోలేకపోతున్నారు.
ఓపెనర్‌గా పరుగులు సాధించలేకపోతున్న బాబర్ ఆజం.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయేమో! ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వారు ఈ ప్రయోగాలు చేయవచ్చు. రిజ్వాన్‌కు విశ్రాంతినిచ్చారు కాబట్టి కొత్త కాంబినేషన్లు ట్రై చేస్తే బాగుంటుంది’’ అని కనేరియా అభిప్రాయపడ్డాడు.
కాగా ప్రపంచకప్ కంటే ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. గతేడాది ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో రాణించిన బాబర్ ఆజం బృందం సెమీస్‌లో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు!
ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు..
Comments
Please login to add a commentAdd a comment