Danish Kaneria asks Babar Azam to learn from 'Selfless' Virat Kohli - Sakshi
Sakshi News home page

కోహ్లిని చూసి నేర్చుకో! మొండితనం పనికిరాదు.. జిడ్డులా పట్టుకుని వేలాడుతూ: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Thu, Nov 17 2022 11:07 AM | Last Updated on Thu, Nov 17 2022 11:56 AM

Danish Kaneria Asks Stubborn Babar Azam To Learn From Selfless Kohli - Sakshi

T20 World Cup 2022- Babar Azam: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా మండిపడ్డాడు. మొండితనం వీడి ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు పలికాడు. అతడి స్వార్థం వల్ల జట్టు నష్టపోతోందని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలని బాబర్‌కు సూచించాడు. నిస్వార్థంగా ఎలా ఉండాలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో పాకిస్తాన్‌ రన్నరప్‌గా నిలిచినప్పటికీ బ్యాటర్‌గా బాబర్‌ ఆజం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మహ్మద్‌ రిజ్వాన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ లాహోర్‌ బ్యాటర్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై అర్ధ శతకం మినహా మిగతా మ్యాచ్‌లలో ఆకట్టుకోలేకపోయాడు. 


బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌- కోహ్లి

జిడ్డులా పట్టుకుని వేలాడుతూ
ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పాక్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా బాబర్‌ ఆట తీరుపై విమర్శలు చేశాడు. ఓపెనింగ్‌ స్థానాన్ని జిడ్డులా పట్టుకుని వేలాడుతూ.. జట్టుకు నష్టం చేకూరుస్తున్నాడని ఫైర్‌ అయ్యాడు. ‘‘బాబర్‌ ఆజం చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు.

తన ఓపెనింగ్‌ స్థానాన్ని వదులుకోవడానికి అతడు ఇష్టపడటం లేదు. కరాచీ కింగ్స్‌తో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన ఇలాగే ఉంది. నిజానికి తను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయలేడు. అందుకే ఇలా చేస్తున్నాడు. 

అయితే, బాబర్‌ ఇలా మొండిగా ఉండటం వల్ల పాకిస్తాన్‌ క్రికెట్‌కు కీడు చేసినవాడు అవుతాడు. ఓపెనర్‌ మరీ ఇంత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే ఎలా?’’ అంటూ కనేరియా ప్రశ్నించాడు. ఇక జట్టు ప్రయోజనాల గురించి ఎలా ఆలోచించాలో విరాట్‌ కోహ్లిని చూసి నేర్చుకోవాలన్న డానిష్‌ కనేరియా.. ‘‘ఈ ప్రపంచంలో విరాట్‌ కోహ్లి లాంటి నిస్వార్థపరుడైన ఆటగాడు మరొకరు ఉండరు.

కోహ్లిని చూసి నేర్చుకో
తన సారథ్యంలో వరల్డ్‌కప్‌ ట్రోఫీ చేజారింది. దాంతో అతడు బలిపశువు అయ్యాడు. కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత జట్టులో అతడి స్థానం గురించి అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే, తను నిరాశ పడలేదు. కొత్త కెప్టెన్‌కు పూర్తిగా సహకారం అందిస్తూ.. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మంటే ఆ స్థానంలో వచ్చాడు. జట్టు కోసం చేయాల్సిదంతా చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు.

అదరగొట్టిన కింగ్‌
టీ20 వరల్డ్‌కప్‌-2022లో విరాట్‌ కోహ్లి 296 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్‌పై 82 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లికి ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మరోవైపు బాబర్‌ ఆజం మొత్తంగా 124 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: T20 WC 2022: బాబర్‌ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్‌ ఓడిపోయింది! లేదంటే
Shaheen Afridi: నీకసలు సిగ్గుందా? నా ఎదురుగా నువ్వు ఉంటేనా: వసీం అక్రమ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement