Shaheen Shah Afridi Treatment- Shahid Afridi Comments On PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. షాహిన్ షా ఆఫ్రిది విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు పట్ల మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ షాహిన్ విషయంలో పీసీబీ గురించి షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని వసీం వ్యాఖ్యానించాడు.
అసలేం జరిగిందంటే...
ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మోకాలి గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం షాహిన్‌ను లండన్‌కు పంపినట్లు పీసీబీ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక గాయం నుంచి కోలుకుంటున్న షాహిన్.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కింది.
ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మాజీ సారథి, షాహిన్‌కు కాబోయే మామగారు షాహిద్ ఆఫ్రిది సామా టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌లో తన సొంత డబ్బుతో షాహిన్ చికిత్స పొందుతున్నాడని.. తానే అతడి కోసం డాక్టర్‌ను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు.
సొంత డబ్బుతో చికిత్స.. నేనే!
ఈ మేరకు.. ‘‘షాహిన్ ఆఫ్రిది తన సొంత డబ్బుతో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. టికెట్‌కు కూడా తనే డబ్బులు చెల్లించాడు. అక్కడ సొంత ఖర్చులతో కాలం వెళ్లదీస్తున్నాడు. నేను డాక్టర్ పేరును సూచించగా.. అతడిని కలిసి చికిత్స తీసుకుంటున్నాడు.
షాహిన్ విషయంలో పీసీబీ అసలు ఎలాంటి చొరవ తీసుకోలేదు. తన సొంత ఖర్చులతో అతడు లండన్‌లో ఉంటున్నాడు. పీసీబీ డైరెక్టర్ జాకిర్ ఖాన్ బహుశా ఒకటీ రెండుసార్లు తనతో మాట్లాడి ఉంటాడు అంతే’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.
స్పందించిన పీసీబీ! కానీ
ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. ‘‘లండన్‌లో చికిత్స పొందుతున్న షాహిన్ షా ఆఫ్రిది కోలుకుంటున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ ఆరంభం నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడు. ఆటగాళ్లకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం.. వారి పునరావాసం విషయంలో పీసీబీ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది.
ఆటగాళ్లకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వాటిని తీర్చడంలో బోర్డు ముందు ఉంటుంది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ.. షాహిన్ చికిత్స విషయంలో ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు.
షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే!
ఈ నేపథ్యంలో.. ఏఆర్‌వై న్యూస్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘ఒకవేళ షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే.. అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. అతడు(షాహిన్ ఆఫ్రిది) పాకిస్తాన్ మేటి ఆటగాళ్లలో ఒకడు.
అలాంటి క్రికెటర్ పట్ల పీసీబీ ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సర్జన్ వద్ద అతడికి చికిత్స చేయించాలి. కానీ, అతడు సొంతంగా ఖర్చులు భరిస్తున్నాడంటే.. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. కాగా షాహిద్ ఆఫ్రిది కుమార్తెతో షాహిన్ వివాహం జరుగనున్న విషయం తెలిసిందే.
చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన
కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
Comments
Please login to add a commentAdd a comment