చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం(Wasim Akram) పెదవి విరిచాడు. ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌కు మాత్రమే చోటివ్వడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బౌలింగ్ ఆల్‌రౌండర్ షాహీం ఆష్రఫ్(Faheem Ashraf)ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు.
కాగా 2017 తర్వాత తొలిసారిగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుండగా.. ఇటీవలే పీసీబీ తమ జట్టును ప్రకటించింది.
అతడిని ఎలా ఎంపిక చేశారు?
ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘జట్టును ప్రకటించేశారు. కొద్ది మంది పేర్లను గమనించాను. ఫాహీం అష్రఫ్ ఈ జట్టులో ఉన్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్. ప్రతిభావంతుడైన క్రికెటరే.
కానీ గత 20 మ్యాచ్‌లలో అతడి బౌలింగ్ సగటు 100.. బ్యాటింగ్ సగటు 9. అయినా.. సరే అష్రఫ్‌ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. ఇక ఖుష్‌దిల్ షా ఎంపిక కూడా అనూహ్యం. అయినా.. ఈసారి మనం ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.
అదే టీమిండియా.. ముగ్గురు, నలుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. అందుకు కారణాలు ఏమైనా గానీ.. మనం మాత్రం ఒకే స్పిన్నర్‌ను ఎంపిక చేయడమేంటి?.. ఇక ఆతిథ్య జట్టుగా మనపై ఎలాగూ ఒత్తిడి ఉంటుంది. అన్ని ప్రతికూలతలు అధిగమించి సెమీ ఫైనల్ వరకైనా చేరాలని ఆశిస్తున్నా’’ అని వసీం అక్రం స్పోర్ట్స్ యారీతో పేర్కొన్నాడు.
ఇదైతే బాగుంది
అయితే, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫఖర్ జమాన్‌ను పిలిపించి మంచి పనిచేశారంటూ పాక్ సెలక్టర్ల నిర్ణయాన్ని వసీం అక్రం సమర్థించాడు. ‘‘మనకు ఓపెనింగ్ జోడీతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకోవడం సానుకూలాంశం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు.
ఏదేమైనా బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలి. అతడి బ్యాటింగ్ టెక్నిక్ గొప్పగా ఉంటుంది. యాభై ఓవర్లపాటు అతడు క్రీజులోనే ఉంటే.. కచ్చితంగా 125 పరుగులైనా చేస్తాడు. ఇక రిజ్వాన్‌ను మిడిలార్డర్‌లో పంపాలి. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. నసీం షా వచ్చేశాడు. ఇప్పటికే షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ ఉన్నారు. వీళ్లకు తోడుగా హస్నైన్ కూడా ఉన్నాడు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.
ఆ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటివ్వాల్సింది
అయితే, ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమిర్ జమాల్‌కు చోటు దక్కకపోవడం తనను నిరాశపరిచిందని వసీం అక్రం ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీర్ఘకాలం పాటు జట్టుకు ఉపయోగపడగల ఆమిర్‌ను సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నాడు.
ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ మరోసారి విజేతగా నిలిస్తే చూడాలని ఉందని.. అయితే, మిగతా జట్లు కూడా వరల్డ్‌క్లాస్ ఆటతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అందరితోపాటు తాను కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించగా.. వరల్డ్‌కప్‌లో సెమీస్ కూడా చేరని పాక్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి దూసుకువచ్చింది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లలేని టీమిండియా.. దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.
చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్‌దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.
చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment