అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్ చివరిసారిగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేని నేపథ్యంలో దాయాదుల మధ్య సమరానికి మరోసారి ప్రపంచకప్ వేదిక కానుంది. రాబోయే టి20 వరల్డ్‌కప్ లో భారత్, పాక్ మధ్య పోరు జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రత్యర్థిపై భారత్ తిరుగు లేని ఆధిపత్యం కనబరుస్తున్నా... సగటు క్రికెట్ అభిమాని దృష్టిలో ఈ మ్యాచ్ ఎప్పుడైనా ప్రత్యేకమే! పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ నాలుగు గెలిచి, ‘టై’గా ముగిసిన మరో మ్యాచ్‌లో ‘బౌల్ అవుట్’లో నెగ్గింది.
దుబాయ్: టి20 ప్రపంచకప్–2021లో పాల్గొనే జట్లకు సంబంధించిన గ్రూప్‌ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ‘సూపర్ 12’ దశలో భారత్, పాకిస్తాన్‌లు గ్రూప్ ‘2’లో ఉండటంతో ఇరు జట్ల మధ్య పోరు ఖాయమైంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధిస్తాయి. గ్రూప్ ‘1’లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా మరో రెండు క్వాలిఫయర్‌లు జత చేరతాయి.
మార్చి 20, 2021 నాటికి ఉన్న ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఈ గ్రూప్‌లను విభజించినట్లు ఐసీసీ వెల్లడించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యూఏఈలలో ప్రపంచకప్ జరుగుతుంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉన్నా... కరోనా కేసులు, థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో వేదికను ఐసీసీ తరలించింది. మ్యాచ్‌ల తేదీలతో పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ త్వరలోనే ప్రకటిస్తుంది. గ్రూప్‌ల ప్రకటన కార్యక్రమం ఒమన్ రాజధాని మస్కట్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీసీ తాత్కాలిక సీఈ జెఫ్ అలార్డిస్‌తోపాటు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా, ఒమన్ క్రికెట్ చైర్మన్ పంకజ్ ఖిమ్జీ తదితరులు పాల్గొన్నారు.
క్వాలిఫయింగ్ ఇలా...
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్–8 జట్లు నాలుగేసి చొప్పున రెండు గ్రూప్‌లలో ఉన్నాయి. ‘సూపర్ 12’లో ఆడే మిగతా నాలుగు స్థానాల కోసం ఎనిమిది టీమ్‌లు పోటీ పడుతున్నాయి. గ్రూప్ ‘ఎ’లో శ్రీలంక, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉండగా... గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, పపువా న్యూ గినియా ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు ముందంజ వేస్తాయి. గ్రూప్ ‘ఎ’ విజేత, గ్రూప్ ‘బి’ రన్నరప్‌లు గ్రూప్ ‘1’కు... గ్రూప్ ‘ఎ’ రన్నరప్, గ్రూప్ ‘బి’ విజేత గ్రూప్ ‘2’కు అర్హత సాధిస్తాయి. తాజా ఫామ్, అంచనాలను బట్టి చూస్తే భారత్ ఉన్న గ్రూప్ ‘1’లో బంగ్లాదేశ్, శ్రీలంక వచ్చే అవకాశం ఉంది. ‘సూపర్ 12’లో ప్రతీ టీమ్ తమ గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్–2 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లను మస్కట్‌లో, తర్వాతి దశ మ్యాచ్‌లను యూఏఈలోని మూడు వేదికలు దుబా య్, అబుదాబి, షార్జాలలో నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment