
Trent Boult Plots Shaheen Afridi Style Assault On India: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 24న టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది(3/31) భారత బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసి, పాక్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం(అక్టోబర్ 31) టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌ను ఉద్దేశించి కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌తో మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది తరహాలో రెచ్చిపోతానని.. టీమిండియా బ్యాటర్ల భరతం పడతానని హెచ్చరించాడు. ఈ సందర్భంగా బౌల్ట్.. అఫ్రిది బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అఫ్రిది బుల్లెట్ వేగంతో బంతులను సంధించడంతో పాటు స్వింగ్‌ను కూడా రాబట్టి టీమిండియాపై విరుచుకుపడ్డాడని, అతన్ని స్పూర్తిగా తీసుకుని తాను కూడా భారత్‌పై చెలరేగుతానని తెలిపాడు.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో పాక్ చేతిలో టీమిండియాతో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌లు కూడా ఖంగుతిన్నాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై చెలరేగిన అఫ్రిది.. కివీస్(4-1-21-1), అఫ్గానిస్థాన్(4-0-22-1)లపై రాణించాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ విషయం టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
చదవండి: అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్‌లోనే మ్యాచ్ ముగించాడు..