
Shreyas Iyer Likely To Be Promoted To Main Squad: టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన 15 మంది సభ్యుల భారత బృందంలో నలుగురు ఆటగాళ్ల ఫామ్ ప్రస్తుతం బీసీసీఐని కలవరపెడుతుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ వేదికగా జరుగుతున్న రెండో దశలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్(11, 14, 9 పరుగులు), సూర్యకుమార్ యాదవ్(3, 5, 8 పరుగులు), రాహుల్ చాహర్(ఒక్క వికెట్) దారుణమైన గణాంకాలను నమోదు చేయగా.. చాలా కాలంగా ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా బౌల్ చేయకపోవడంతో పాటు బ్యాటింగ్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 7.85 సగటున పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు.
దీంతో ఈ నలుగురు ఆటగాళ్ల ఎంపికపై బీసీసీఐ, సెలెక్టర్లు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని వీరిని తప్పించి ఐపీఎల్‌లో రాణిస్తున్న దేవ్‌దత్ పడిక్కల్/ శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్/ దీపక్ చహర్, చహల్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచకప్ జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు బీసీసీఐకి అక్టోబర్ 10 వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో మార్పులు తధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పందించారు. ప్రస్తుతం ఆ నలుగురు ఫామ్ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. మరో 12 రోజుల సమయం(మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు) ఉన్నందున వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినా.. ఇప్పుడు వరుస హాఫ్ సెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. సూర్యకుమార్, ఇషాన్ కిషన్ టీమిండియా తరఫున రాణించారని.. రాహుల్ చాహర్ తొలి దశలో పర్వాలేదనిపించాడని.. ఒక్క హార్ధిక్ పాండ్యా విషయమే బీసీసీఐకి తలనొప్పిగా మారిందని సదరు అధికారి చెప్పుకొచ్చాడు. రానున్న మ్యాచ్‌ల్లో ఈ నలుగురు ఆశించిన మేరకు రాణించకపోతే వారిని తప్పించేందుకు బీసీసీఐ ఏమాత్రం వెనుకడుగు వేయకపోవచ్చని, వారి స్థానాల భర్తీ విషయమై శ్రేయస్ అయ్యర్ సహా పలు ఆప్షన్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నాడు.
చదవండి: ఉన్ముక్త్ చంద్ పరుగుల సునామీ.. రికార్డు శతకం నమోదు
Comments
Please login to add a commentAdd a comment