వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ గురి తప్పలేదు. ‘ఆరెంజ్’ టీమ్‌పై తమదైన రేంజ్ ప్రదర్శన కనబర్చి అటు విజయంతోపాటు ఇటు రన్‌రేట్‌ను కూడా అమాంతం మెరుగుపర్చుకున్న టీమిండియా గ్రూప్–2లో అగ్ర స్థానానికి చేరింది. నెదర్లాండ్స్ సాధారణ బౌలింగ్‌ను ముగ్గురు బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొని అర్ధ సెంచరీలు సాధించడంతోనే జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది.
ముఖ్యంగా సూర్యకుమార్ మెరుపులు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ‘డచ్’ బృందం తేలిపోయింది. ఆ జట్టు కనీస స్థాయి ఆటను కూడా చూపించలేకపోవడంతో సంచలనానికి అవకాశం లేకపోయింది. సిడ్నీలో ఈ సమష్టి విజయంతో భారత్ మరింత ఉత్సాహంతో ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో సమరానికి సిద్ధం కానుంది.
సిడ్నీ: పాకిస్తాన్‌పై చిరస్మరణీయ గెలుపు తర్వాత మరో మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ టి20 ప్రపంచకప్‌లో దూసుకుపోయింది. గురువారం జరిగిన గ్రూప్–2 పోరులో భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కోహ్లి రెండో వికెట్‌కు రోహిత్‌తో 73 పరుగులు (56 బంతుల్లో), మూడో వికెట్‌కు సూర్యకుమార్‌తో అభేద్యంగా 95 పరుగులు (48 బంతుల్లో) జోడించాడు. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. టిమ్ ప్రింగిల్ (20) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో భువనేశ్వర్, అక్షర్, అశ్విన్, అర్‡్షదీప్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
రాణించిన కెప్టెన్...
తొలి మ్యాచ్‌తో పోలిస్తే నెమ్మదిగా ఉన్న పిచ్‌పై రోహిత్ శర్మ ఆరంభంలో పూర్తి నియంత్రణతో ఆడలేకపోయాడు. అయితే అతి జాగ్రత్తకు పోకుండా ఏదోలా బౌండరీలు బాదేందుకే అతను ప్రయత్నించాడు. పవర్‌ప్లేలో భారత్ 32 పరుగులే చేయగలిగింది. మీకెరెన్ ఓవర్లో లెగ్‌సైడ్‌లో సిక్స్ బాదిన రోహిత్‌కు ఆ తర్వాత కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 13 పరుగుల వద్ద క్లాసెన్ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ప్రింగిల్ వదిలేశాడు. 27 పరుగుల వద్ద బీక్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా, రివ్యూలో బంతి ముందుగా బ్యాట్‌కు తగిలినట్లు తేలింది. ఆ తర్వాత డి లీడ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన అతను, ప్రింగిల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ వెనుదిరిగాడు.
భువీ సూపర్ స్పెల్...
ఛేదనలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగలేదు. తక్కువ వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చిన జట్టు కోలుకోలేకపోయింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఒక వికెట్ తీసిన భువనేశ్వర్ పూర్తిగా కట్టిపడేశాడు. కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒ డౌడ్ (10 బంతుల్లో 16; 3 ఫోర్లు)ను అక్షర్ తన రెండో బంతికే పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో స్కోరు 27 పరుగులు కాగా, అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో స్కోరు 63/5 వద్ద నిలిచింది. అనంతరం 14 పరుగుల వ్యవధిలో నెదర్లాండ్స్ తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. ఓటమి ఖాయమైన తర్వాత
అర్‡్షదీప్ వేసిన ఆఖరి ఓవర్ చివరి 3 బంతులను వరుసగా ఫోర్లు కొట్టి మీకెరన్ డచ్ అభిమానులకు కాస్త ఆనందం పంచాడు.
రివ్యూ చేయకుండా...
ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కేఎల్ రాహుల్ (9) నిరాశపర్చాడు. ఇబ్బందిగా ఆడుతున్న అతడిని మీకెరెన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ ఎల్బీగా ప్రకటించిన అనంతరం అతను కెప్టెన్‌తో చర్చించాడు. రోహిత్ రివ్యూ తీసుకోమని సలహా ఇచ్చినా... రాహుల్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే రీప్లేలో బంతి లెగ్‌సైడ్ దిశగా వెళుతున్నట్లు కనిపించింది. రివ్యూ కోరితే రాహుల్ పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.
ఆసాంతం దూకుడు...
ఇద్దరు సీనియర్లతో పోలిస్తే సూర్యకుమార్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వచ్చీ రాగానే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లోనే అతను 5 ఫోర్లు బాదాడు. మీకెరెన్, డి లీడ్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా చూడచక్కటి సిక్సర్ కొట్టడంతో 25 బంతుల్లోనే సూర్య అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి 5 ఓవర్లలో భారత్ 65 పరుగులు రాబట్టింది.
చివర్లో జోరుగా...
కోహ్లి కూడా ఆరంభంలో ఎలాంటి సాహసాలకు పోలేదు. నిలదొక్కుకున్న తర్వాతే ధాటిగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. తనదైన శైలిలో సింగిల్స్ తీయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 పరుగులే బౌండరీల ద్వారా రాగా, వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారానే 38 పరుగులు వచ్చాయి. క్లాసెన్ బౌలింగ్‌లో అతను కొట్టిన ‘ఇన్‌సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్‌గా నిలిచింది. 37 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తయింది. తాను ఆడిన తొలి 30 బంతుల్లో 32 పరుగులే చేసిన విరాట్, తర్వాతి 14 బంతుల్లో 30 పరుగులు రాబట్టడం విశేషం.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మీకెరెన్ 9; రోహిత్ (సి) అకెర్‌మన్ (బి) క్లాసెన్ 53; కోహ్లి (నాటౌట్) 62; సూర్యకుమార్ (నాటౌట్) 51; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–11, 2–84.
బౌలింగ్: క్లాసెన్ 4–0–33–1, ప్రింగిల్ 4–0–30–0, మీకెరెన్ 4–0–32–1, బాస్ డి లీడ్ 3–0–33–0, వాన్ బీక్ 4–0–45–0, షారిజ్ 1–0–5–0.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) భువనేశ్వర్ 1; మ్యాక్స్ ఒ డౌడ్ (బి) అక్షర్ 16; బాస్ డి లీడ్ (సి) పాండ్యా (బి) అక్షర్ 16; అకెర్‌మన్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 17; కూపర్ (సి) (సబ్) దీపక్ హుడా (బి) అశ్విన్ 9; ఎడ్వర్డ్స్ (సి) (సబ్) దీపక్ హుడా (బి) భువనేశ్వర్ 5; ప్రింగిల్ (సి) కోహ్లి (బి) షమీ 20; వాన్ బీక్ (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 3; షారిజ్ (నాటౌట్) 16; క్లాసెన్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మీకెరెన్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 123.
వికెట్ల పతనం: 1–11, 2–20, 3–47, 4–62, 5–63, 6–87, 7–89, 8–101, 9–101.
బౌలింగ్: భువనేశ్వర్ 3–2–9–2, అర్‡్షదీప్ 4–0–37–2, షమీ 4–0–27–1, అక్షర్ 4–0–18–2, హార్దిక్ 1–0–9–0, అశ్విన్ 4–0–21–2.
34: టి20 ప్రపంచకప్‌లలో రోహిత్ సిక్సర్ల సంఖ్య. భారత ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ (33)ను దాటి అగ్ర స్థానంలో నిలిచాడు.
ఓవరాల్‌గా క్రిస్ గేల్ (63) ముందున్నాడు.
20: అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన భారత బౌలర్‌గా భువనేశ్వర్ (20 ఓవర్లు) నిలిచాడు. ప్రవీణ్ కుమార్, బుమ్రా (19 ఓవర్ల చొప్పున) పేరిట ఉన్న రికార్డును భువనేశ్వర్ సవరించాడు.
57: మూడు ఫార్మాట్‌లలో కలిపి ఈ ఏడాది భారత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య. 2007 లో భారత్ అత్యధికంగా 55 మ్యాచ్‌లు ఆడింది.
867: ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ (25 మ్యాచ్‌ల్లో 867) టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (20 మ్యాచ్‌ల్లో 839 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment