Virat Kohli Comments: క్రికెటర్లు... ముఖ్యంగా సంపన్న బోర్డులకు చెందిన ఆటగాళ్ల షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోసారి... వరుస సిరీస్‌ల కారణంగా సరిగ్గా విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం దొరకని పరిస్థితి. ఇక కరోనా కాలంలో సుదీర్ఘ కాలంపాటు బయో బబుల్‌లో గడపటం కొంతమంది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపింది. క్రిస్ గేల్ వంటి సీనియర్లు సైతం బయో బబుల్‌లో ఉండలేక ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగిన వైనం చూశాం.
ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్-2021 ఈవెంట్‌కు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు. బయో బబుల్‌లో గడపటం అంత తేలికేమీ కాదని... భవిష్యత్తులో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘కొన్ని అనూహ్య కారణాల(కరోనా వ్యాప్తి) వల్ల చాలా కాలం పాటు గ్యాప్ రావడం వల్ల వరుస సిరీస్‌లు, టోర్నీలతో అభిమానులను అలరించేందుకు ఆటగాళ్లు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక బబుల్ లైఫ్ గురించి ఇప్పటికే చాలా సార్లు మాట్లాడాం.
నిజానికి ఐపీఎల్‌లో ఆడటం వల్ల మాకు ఆ పరిస్థితులు అలవడ్డాయి. అయినా... ప్రతిరోజూ ఒక కొత్త సవాలే. ఇప్పుడు వరల్డ్‌కప్ టోర్నీలోనూ అదే పరిస్థితి. ఇక్కడ ప్రపంచ దేశాల జట్లతో ఆడతాం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోటీ పడని జట్టుతో ఆడే పరిస్థితి రావొచ్చు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ముందుకు సాగవలసి ఉంటుంది.
అయితే, బయో బబుల్‌లో ఉండే ఒత్తిడి, ఇతర విషయాల గురించి అందరు ఆటగాళ్లు స్వేచ్ఛగా మాట్లాడాలి. నిజానికి... అక్కడ ఉన్నపుడు ఎవరి మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఐదారుగురు ఆటగాళ్లు నవ్వుతూ ఉన్నంత మాత్రాన జట్టులోని 15-16 మంది ఆటగాళ్లు అదే విధంగా సంతోషంగా ఉంటారని అనుకోవడం పొరపాటే. మానసికంగా రిఫ్రెష్ అయ్యేందుకు.. బయో బబుల్ వాతావరణంలో ఇమిడి పోయే పరిస్థితులు కల్పించాలి’’ అని కోహ్లి క్రికెట్.కామ్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్‌కప్ టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
చదవండి: Shoaib Akhtar: టీమిండియా ఆటగాళ్లకు స్లీపింగ్ పిల్స్ ఇవ్వండి.. ధోని బ్యాటింగ్‌కు రావొద్దు.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment