Emma Raducanu Shook the World with the US Open Title - Sakshi
Sakshi News home page

Emma Raducanu: అద్భుతం ఆవిష్కృతం

Published Mon, Sep 13 2021 5:31 AM | Last Updated on Mon, Sep 13 2021 11:16 AM

Teenage Emma Raducanu shook the world with the US Open title - Sakshi

కష్టపడితే కలలు కూడా నిజమవుతాయని... అసాధ్యమనుకున్నవి సుసాధ్యమవుతాయని... ర్యాంక్‌తో సంబంధం లేదని... వయసుతో పనిలేదని... అపార అనుభవం అక్కర్లేదని... సత్తా ఉంటే... గెలవాలనే సంకల్పం ఉంటే... అద్భుతాలు చేయవచ్చని బ్రిటన్‌ టెన్నిస్‌ టీనేజర్‌ ఎమ్మా రాడుకాను నిరూపించింది.

మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడమే లక్ష్యంగా న్యూయార్క్‌ వచ్చిన ఈ 18 ఏళ్ల అమ్మాయి మూడు వారాల్లో ఊహకందని అద్భుతాన్ని ఆవిష్కరించింది. టెన్నిస్‌ చరిత్రలో క్వాలిఫయర్‌ హోదాలో గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా రాడుకాను చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత బ్రిటన్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.

న్యూయార్క్‌: ఏనాటికైనా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఆడాలని... విజేతగా నిలిచి కోర్టు అంతా కలియ తిరగాలని... స్టాండ్స్‌లోకి వెళ్లి తన వాళ్లతో సంబరాలు చేసుకోవాలని... సగర్వంగా ట్రోఫీని ముద్దాడాలని... ఐదేళ్ల ప్రాయంలో రాకెట్‌ పట్టినప్పటి నుంచి రాడుకాను కలల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించేవి. రాడుకాను కలల్లో కనిపించిన ఈ దృశ్యాలు ఆదివారం న్యూయార్క్‌లోని ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో నిజమయ్యాయి.

టైటిల్‌ ఫేవరెట్స్‌ ఒక్కొక్కరూ ఇంటిముఖం పడుతుంటే... ఎవరూ ఊహించని విధంగా సంచలనాల మోత మోగిస్తూ ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు 18 ఏళ్ల ఎమ్మా రాడుకాను, 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కోసం తలపడ్డారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ముగిసిన ఈ ఫైనల్లో ప్రపంచ 150వ ర్యాంకర్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) గంటా 51 నిమిషాల్లో 6–4, 6–3తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన రాడుకానుకు 25 లక్షల డాలర్లు (రూ. 18 కోట్ల 37 లక్షలు)... రన్నరప్‌ లేలా ఫెర్నాండెజ్‌కు 12 లక్షల 50 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 18 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

ఆరంభంలోనే బ్రేక్‌తో...
24 వేల మంది ప్రేక్షకులతో హౌస్‌ఫుల్‌ అయిన ఆర్థర్‌ యాష్‌ స్టేడియంలో రాడుకాను, లేలా ఫైనల్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా రాడుకాను ఫైనల్‌ చేరగా... గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్‌లో నెగ్గి లేలా తుది పోరుకు సమాయత్తమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), 16వ సీడ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌)లను బోల్తా కొట్టించిన లేలా ఫైనల్లో ఫేవరెట్‌గా అడుగుపెట్టింది.

కానీ క్వాలిఫయింగ్‌ దశ నుంచి మెయిన్‌ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన రాడుకాను మాత్రం లేలా గత మ్యాచ్‌ల ప్రదర్శనను చూసి ఆందోళన చెందలేదు. తన సర్వీస్‌తో తొలి సెట్‌ను మొదలుపెట్టిన రాడుకాను గేమ్‌ను సాధించి 1–0తో ముందంజ వేసింది. లేలా సర్వీస్‌ చేసిన రెండో గేమ్‌లో రాడుకాను దూకుడు కనబరిచింది. లేలా కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ గేమ్‌లో నాలుగుసార్లు డ్యూస్‌ (40–40) నమోదయ్యాయి.

చివరకు ఐదో ప్రయత్నంలో రాడుకాను పాయింట్‌ సాధించి లేలా సరీ్వస్‌ను బ్రేక్‌ చేసి 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే లేలా డీలా పడిపోలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సరీ్వస్‌లో మూడుసార్లు ‘డ్యూస్‌’ అయింది. నాలుగో ప్రయత్నంలో లేలా పాయింట్‌ గెలిచి రాడుకాను సరీ్వస్‌ను బ్రేక్‌ చేసింది. ఆ తర్వాత తన సరీ్వస్‌ను నిలబెట్టుకుంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం ఇద్దరూ తమ సరీ్వస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 4–4తో సమమైంది. తొమ్మిదో గేమ్‌లో రాడుకాను తన సరీ్వస్‌ను నిలబెట్టుకొని పదో గేమ్‌లో లేలా సరీ్వస్‌ను బ్రేక్‌ చేసి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.

గాయమైనా...
తొలి సెట్‌ను నెగ్గిన ఉత్సాహంలో రెండో సెట్‌లోనూ రాడుకాను దూకుడు కొనసాగింది. మరోవైపు లేలా కూడా పోరాటం ఆపలేదు. మూడో గేమ్‌లో రాడుకాను సర్వీస్‌ను బ్రేక్‌ చేసి పుంజుకున్నట్లు కనిపించిన లేలా నాలుగో గేమ్‌లో తన సర్వీస్‌ను కోల్పోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఆరో గేమ్‌లో లేలా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన రాడుకాను ఏడో గేమ్‌లో సరీ్వస్‌ కాపాడుకొని 5–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో లేలా తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది.

ఈ గేమ్‌ చివర్లో స్లయిడ్‌ షాట్‌ ఆడే క్రమంలో రాడుకాను ఎడమ కాలికి గాయమై రక్తస్రావమైంది. రాడుకాను మెడికల్‌ టైమ్‌ కోరగా... లేలా మాత్రం చైర్‌ అంపైర్‌ వద్ద అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ లేలా అభ్యంతరాన్ని చైర్‌ అంపైర్‌ తోసిపుచ్చి డాక్టర్‌ను కోర్టులోకి పిలిచారు. కాలికి చికిత్స చేసుకున్నాక రాడుకాను మ్యాచ్‌ కోసం సర్వీస్‌ చేసింది. ఒకసారి బ్రేక్‌ పాయింట్‌ను కాచుకున్న రాడుకాను రెండుసార్లు డ్యూస్‌ అయ్యాక మూడోసారి ఏస్‌ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. గత నాలుగు మ్యాచ్‌లను మూడో సెట్‌ వరకు తీసుకెళ్లి గెలిచిన లేలా ఈసారి మాత్రం సఫలం కాలేకపోయింది.

మహిళల టెన్నిస్‌ భవిష్యత్‌ను ఈ ఫైనల్‌ చూపించింది. ‘డ్రా’లో ఉన్న ఏ క్రీడాకారిణి అయినా గెలవొచ్చనే సందేశాన్నిచ్చింది. బిల్లీ జీన్‌ కింగ్, వర్జినియా వేడ్, టిమ్‌ హెన్మన్‌లాంటి టెన్నిస్‌ దిగ్గజాల అడుగుజాడల్లో కొత్త తరం నడుస్తుందని ఆశిస్తున్నాను. ప్రత్యర్థి లేలా పోరాడింది. ఆమెను ఓడించడం అంత సులభం కాదు. భవిష్యత్‌లో మేం మళ్లీ మళ్లీ ఫైనల్లో తలపడాలని కోరుకుంటున్నాను.     
 –రాడుకాను

(9/11) ఉగ్రదాడి తర్వాత గత 20 ఏళ్లలో న్యూయార్క్‌ నగరం తేరుకున్న తీరు అపూర్వం. ఈ నగరంలానే నేనూ పుంజుకుంటాను. న్యూయార్క్‌ వాసుల ఆత్మస్థయిర్యమే నాకు స్ఫూర్తి. వచ్చే ఏడాదీ ఇక్కడ ఫైనల్‌ ఆడతాను. అప్పుడు తప్పకుండా ట్రోఫీని ఎగరేసుకుపోతాను. ఈ ఫైనల్లో ఎమ్మా బాగా ఆడింది. ఆమెకు నా అభినందనలు.
            –లేలా ఫెర్నాండెజ్‌

రన్నరప్‌ ట్రోఫీతో లేలా ఫెర్నాండెజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement