నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో వరుసగా నాలుగు విజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టుకు పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 34–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ మలిక్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... కెప్టెన్ పవన్ సెహ్రావత్ 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. యూపీ యోధాస్ తరఫున భవాని రాజ్‌పుత్ 12, భరత్ 11 పాయింట్లు సాధించారు.
తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 5 విజయాలు, 4 పరాజయాలలతో 25 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు యూపీ యోధాస్ లీగ్‌లో నాలుగో మ్యాచ్ నెగ్గి 25 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 35–32 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది.
యు ముంబా తరఫున మన్‌జీత్ 10 పాయింట్లు, అజిత్ చవాన్ 8 పాయింట్లు సాధించగా... తలైవాస్ తరఫున మోయిన్ 10 పాయింట్లతో పోరాడాడు. 10 మ్యాచ్‌లాడి 6వ విజయం నమోదు చేసుకున్న యు ముంబా జట్టు 34 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరగా... వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓటమి పాలైన తమిళ్ తలైవాస్ 22 పాయింట్లతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), జైపూర్ పింక్ పాంథర్స్‌తో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment