England vs India 2nd Test: KL Rahul Slams Sixth Ton, KL Rahul Slams 6th Test Hundred - Sakshi
Sakshi News home page

వారెవ్వా.. కేఎల్‌ రాహుల్‌ ఇరగదీశాడుగా

Published Thu, Aug 12 2021 11:12 PM | Last Updated on Fri, Aug 13 2021 11:26 AM

Tema India Vs England 2nd Test, KL Rahul Slams Sixth Ton - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న  రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇరగదీశాడు. తొలుత క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రాహుల్‌ సెంచరీతో మెరిశాడు. 212 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని తాను ఎంత విలువైన ఆటగాడు నిరూపించాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన రాహుల్‌.. రెండో టెస్టులో మాత్రం శతకం నమోదు చేశాడు.

ఇది రాహుల్‌ టెస్టు కెరీర్‌లో ఆరో శతకంగా నమోదైంది. ఇదిలా ఉంచితే, లార్డ్స్‌ మైదానంలో సెంచరీ సాధించిన మూడో భారత ఓపెనర్‌గా రాహుల్‌ ఘనత సాధించాడు. అంతకుముందు రవిశాస్త్రి(1990), వినోద్‌ మన్కడ్‌(1952)లు మాత్రమే లార్డ్స్‌లో సెంచరీ సాధించిన భారత ఓపెనర్లు కాగా, వారి సరసన ఇప్పుడు రాహుల్‌  చేరిపోయాడు.

కాగా, ఆసియా బయట టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి రాహుల్‌ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్‌ 15 సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా, సెహ్వాగ్‌-రాహుల్‌లు తలో నాలుగు సెంచరీలు సాధించారు. ఆ తర్వాత స్థానంలో వినోద్‌ మన్కడ్‌-రవిశాస్త్రిలు తలో మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. 

అంతకుముందు తాజా టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్‌ అరుదైన రికార్డును నమోదు చేశాడు.  ఈ జోడి 126 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో సుమారు ఏడు దశాబ్దాల రికార్డు బ్రేక్‌ అయ్యింది. లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్‌ జోడిగా నిలిచింది. 

1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది. రోహిత్‌-రాహుల్‌లు 106 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వినోద్‌-పంకజ్‌ల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేసి సరికొత్త రికార్డు లిఖించారు. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ 83 పరుగులు చేసి ఔటయ్యాడు.  145 బంతుల్లో 11 ఫోర్లు,  1 సిక్స్‌ సాయంతో 83 పరుగులు చేసిన రోహిత్‌.. అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. 85 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.  కోహ్లి(42) ఫర్వాలేదనిపించగా, చతేశ్వర పుజారా(9) విఫలమయ్యాడు. 

ఇక్కడ చదవండి: 69 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన రోహిత్‌-రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement