ఐపీఎల్ భారత్‌లో లేట్ అయినా... యూఏఈలో లేటెస్ట్‌గా మొదలవుతుందిలే అనుకుంటే మాయదారి మహమ్మారే అక్కడా మొదలైంది. మూడు సార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్‌కింగ్స్ మెడకు కోవిడ్ చుట్టుకుంది. జట్టు బృందంలో భాగమైన పది మందికి కరోనా సోకింది. సీఎస్‌కే టీమ్‌నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా... వీరిలో పేసర్ దీపక్ చహర్ ఉన్నట్లు సమాచారం. లీగ్ ప్రారంభానికి తగినంత సమయం ఉన్నా... తొలిసారి లీగ్‌కు చెందిన క్రికెటర్ కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. మున్ముందు ఇది ఎంత వరకు వెళుతుందనే ఆందోళన కూడా కనిపిస్తోంది.
అబుదాబీ: చెన్నై సూపర్‌కింగ్స్‌ను మహమ్మారి చుట్టేసింది. అంతా బాగుందనుకుంటున్న తరుణంలో... ఇక ప్రాక్టీస్, మైదానంలో మెరుపులే తరువాయి అనుకుంటున్న దశలో... ఇక్కడి యూఏఈ వర్గాలు, భారత్‌లోని బీసీసీఐ వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేసే పిడుగు వచ్చి పడింది. చెన్నై సహాయక బృంద సభ్యులతో పాటు భారత ఆటగాడు దీపక్ చహర్‌కు కరోనా సోకడం లీగ్‌కు ముప్పు లేకపోయినా కాస్త ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఆటగాళ్ల క్వారంటైన్ రోజుల్ని పెంచారు. చెన్నై కోవిడ్ కేసులపై బయటకు తెలిసిపోయినా... సదరు ఫ్రాంచైజీ మాత్రం మొదట నోరే మెదపలేదు. గురువారం పరీక్షా ఫలితాలు వచ్చినా మిన్నకుండిపోయింది.
ఎంతమందికి వైరస్ సోకింది.... ఎవరా సభ్యులు అనే విషయాలేవీ తెలపకుండా తాత్సారం చేసింది. దీంతో అధికారికంగా ఎంతమంది మహమ్మారి బారిన పడ్డారో తెలియలేదు. అయితే ఇక్కడి వర్గాల సమాచారం మేరకు 10 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులున్నట్లు తెలిసింది. ఒకరు ఆటగాడైతే మిగతావారంతా జట్టు సహాయ సభ్యులేనని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో బాధితులున్నప్పటికీ ఆటగాడు ఒక్కడే ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఈ 10 మంది ఇంకెంత మందికి అంటించారోననే బెంగ బీసీసీఐని ఆందోళన పరుస్తోంది. చెన్నై ఫ్రాంచైజీ ఇప్పుడు ప్రాక్టీస్‌కు కాకుండా హోటల్ గదులకే పూర్తిగా పరిమితం కానుంది. ధోని సహా ఆటగాళ్లంతా సెప్టెంబర్ మొదటి వారంలోనే నెట్స్‌కు వెళ్లే అవకాశముంది. లీగ్ 19న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
కిం కర్తవ్యం?
ఐపీఎల్ టోర్నీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ) ప్రకారం పాజిటివ్ బాధితులంతా వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లాలి. అలాగే వాళ్లతో కాంటాక్టు అయిన వ్యక్తుల్ని గుర్తించి వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచాలి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలతో ఉన్న వారిని బయో సెక్యూర్ (జీవ రక్షణ బుడగ) నుంచి రెండు వారాల పాటు వెలుపలే వుంచి చికిత్స అందజేస్తారు. ఈ సమయంలో మిగతా ఆటగాళ్లను, ఐపీఎల్, ఫ్రాంచైజీ వర్గాలను ఎట్టిపరిస్థితుల్లోనూ కలవరాదు. లక్షణాలున్న బాధితుల్ని టోర్నమెంట్ అనుబంధ ఆసుపత్రికి తరలిస్తారు. ఇక లక్షణాలు లేకపోయినా సరే ప్రాక్టీస్‌కు అనుమతించరు. 14 రోజుల పాటు పూర్తిగా గదులకే పరిమితం కావాలి. ఈ ఐసోలేషన్ సమయం పూర్తయ్యాక రెండు సార్లు వరుస పరీక్షల్లో అది కూడా పీసీఆర్ టెస్టుల్లోనే (ర్యాపిడ్ కిట్ టెస్టు కాకుండా) నెగెటివ్ రిపోర్ట్ రావాలి. అప్పుడే బుడగ లోపలికి తీసుకుంటారు.
ఇక ఎవరికి వారే..
తాజా ఉదంతంతో బీసీసీఐ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఐసోలేషన్‌లో ఉన్నవారెవరూ ఒకరితో ఒకరు మాట్లాడేందుకు కూడా ఇక మీదట అనుమతించరు. కాంటాక్టు అయ్యేవారి వివరాల్ని పక్కగా నిక్షిప్తం చేస్తారు. దీంతో మహమ్మారి బారిన పడిన వారి కాంటాక్టు వ్యక్తుల్ని ఎక్కడికక్కడ నిర్బంధించే అవకాశముంటుంది. రిస్కు రేటు తగ్గించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కృషి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ అధికారగణం నిర్ణయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment