మూడో స్థానంలో బ్యాటింగ్‌పై తిలక్ వర్మ
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో మూడో టి20లో అజేయ సెంచరీతో ఆకట్టుకున్న హైదరాబాద్ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ... ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తిలక్... ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగి మరీ మూడో స్థానంలో బరిలోకి దిగి సత్తా చాటాడు.
తొలి రెండు టి20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి వరుసగా 33, 20 పరుగులు చేసిన తిలక్ వర్మ... తనను తాను నిరూపించుకోవడానికి ఒక స్థానం ముందే బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నట్లు కెప్టెన్ కు వివరించాడు. దీనికి అంగీకరించిన సూర్యకుమార్ తాను బ్యాటింగ్ చేయాల్సిన మూడో ప్లేస్‌లో తిలక్‌ను దింపాడు. దీంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే క్రీజులోకి అడుగుపెట్టిన తిలక్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న సమయంలో తిలక్ తన హావభావాలతో సారథికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ‘సూర్యకుమార్ వల్లే అది సాధ్యమైంది. అతడు మూడో స్థానంలో ఆడే అవకాశం ఇవ్వడంతోనే స్వేచ్ఛగా ఆడాను. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశా. నాకు స్వతహాగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్ ఇష్టం. అదే సూర్యకు చెప్పా. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రే అతడు దానికి అంగీకారం తెలిపాడు.
ఈ అవకాశం ఇచ్చినందుకు మైదానంలో నేనేంటో నిరూపించుకుంటా అని ముందే చెప్పాను. విఫలమైన సమయంలోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. సహజ సిద్ధమైన ఆట ఆడేవిధంగా ప్రోత్సహించింది. కెపె్టన్, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. వికెట్ పడ్డా వెనకడుగు వేయవద్దని సూచించారు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించగా... తిలక్ వర్మ 56 బంతుల్లోనే అజేయంగా 107 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి శతకం తన పేరిట లిఖించుకున్నాడు. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. గాయాల కారణంగా కొన్నాళ్ల పాటు జట్టుకు దూరమైన తిలక్ వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడమే తన పని అని వివరించాడు. ఆల్‌రౌండర్‌గా జట్టుకు సేవలందించేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment