నేడు భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే
ఆధిక్యంపై టీమిండియా దృష్టి
స్పిన్ దళంతో అసలంక బృందం
మధ్యాహ్నం గం. 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
కొలంబో: వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేస్తుందనుకున్న భారత్‌కు తొలి మ్యాచ్ ‘టై’ ఫలితం ఏమాత్రం ఊహించనిది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆతిథ్య బౌలర్లు ఓడే మ్యాచ్‌ను సమం చేసుకున్నారు. బంతులు మిగిలున్నా... స్పిన్ ఉచ్చులో పడి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన భారత్ ఇప్పుడు ఆ ‘టై’ని బ్రేక్ చేసే పనిలో పడింది.
ఆదివారం జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. పైగా ఈ వేదికపై టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఇక్కడ 6 వన్డేల్లో గెలిచిన ఘనత భారత్‌ది! సరిగ్గా మూడేళ్ల క్రితం 2021లో చివరిసారిగా లంక చేతిలో ఓడింది. తర్వాత గత ‘టై’ మినహా ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది.
మిడిలార్డర్ బాధ్యతగా ఆడితే...
తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు బాగానే ఆడారు. 231 లక్ష్యఛేదనలో 130/3 స్కోరు వద్ద పటిష్టంగానే ఉంది. 101 పరుగులు చేస్తే గెలిచే చోటా ఏడు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా సరిగ్గా 100 చేసింది. మిడిలార్డర్‌లో నిలకడలేమి వల్లే జట్టు చివరకు ‘టై’ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒక్క మ్యాచ్‌తో వేలెత్తిచూపేలా బ్యాటింగ్ ఆర్డర్ అయితే లేదు.
కాస్త ఓపిక, అదేపనిగా స్పిన్‌ను ఎదుర్కోనే సహనం కనబరిస్తే చాలు జట్టు గాడిన పడుతుంది. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు బ్యాట్ ఝళిపిస్తే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లవచ్చు. స్పిన్ ట్రాక్ కావడంతో మూడో పేసర్‌కు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అర్‡్షదీప్, సిరాజ్‌లకు తోడుగా ముగ్గురు స్పిన్నర్లు అక్షర్, సుందర్, కుల్దీప్‌లతో బౌలింగ్ దళం బరిలోకి దిగుతుంది.
పైచేయి సాధించే పనిలో...
పొట్టి ఫార్మాట్‌లో క్లీన్‌స్వీప్ అయిన ఆతిథ్య శ్రీలంక తొలి వన్డేలో ప్రత్యర్థికి దీటుగా పోరాడింది. ఈ మ్యాచ్‌లో విజయం లభించకపోయినా... వచ్చిన కొండంత ఆత్మవిశ్వాసమే బలంగా ఇప్పుడు లంక బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో నిసాంక సూపర్‌ఫామ్‌లో ఉండటం... స్పిన్నర్లు పట్టు బిగించడం జట్టు స్థయిర్యాన్ని పెంచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో గెలిచి పైచేయి సాధించాలని అసలంక సేన భావిస్తోంది.
కలిసొచ్చే పిచ్‌పై నమ్ముకున్న స్పిన్ బౌలింగ్ దళం జట్టును ఒడ్డున పడేస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ అంచనాలతో ఉంది. టాపార్డర్‌లో అవిష్క, కుశాల్ మెండిస్, సమరవిక్రమ కూడా తమవంతు పాత్ర పోషిస్తే పరుగుల రాక సులువవుతుంది. లోయర్ ఆర్డర్‌లో దునిత్ వెలలగే రూపంలో జట్టును ఆదుకునే బ్యాటర్ ఉండటం జట్టుకు అదనపు బలం. బౌలింగ్‌లో స్పిన్నర్లు హసరంగ, అసలంక, ధనంజయ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్‌ల కాకుండా వన్డే సిరీస్ పోటాపోటీగా జరగడం ఖాయం.
పిచ్, వాతావరణం
ప్రేమదాస స్టేడియం స్పిన్‌కే అనుకూలం. గత మ్యాచ్‌లో పడిన 18 వికెట్లలో స్పిన్నర్ల (13) వాటానే అధికం. దీంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఆదివారం చిరుజల్లు కురిసే అవకాశముంది.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, సిరాజ్, అర్‡్షదీప్.
శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, లియనగే, వెలలగే, హసరంగ, ధనంజయ, షిరాజ్, అసిత ఫెర్నాండో.
Comments
Please login to add a commentAdd a comment