మరో పంచ్‌కు రెడీ!
∙ నేడు రెండో వన్డే
∙ జోరు మీదున్న భారత్
∙ శ్రీలంక కోలుకునేనా!
తొలి టెస్టు నుంచి తొలి వన్డే వరకు వరుసగా నాలుగు మ్యాచ్‌లు... ఒకదాన్ని మించి మరో మ్యాచ్‌లో భారత్ అత్యద్భుత ఆటతీరు ఒకవైపు... కనీస పోటీ కూడా ఇవ్వలేకుండా పేలవంగా కుప్పకూలుతున్న శ్రీలంక మరోవైపు... ఇరు జట్ల మధ్య పోరు మరీ ఏకపక్షంగా మారిపోయింది. టీమిండియాలో ప్రతీ ఆటగాడు తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంటే... లంక క్రికెటర్లు ఘోరమైన ప్రదర్శన ఇవ్వడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. అభిమానుల ఆసక్తిని దూరం చేస్తున్న ఈ పర్యటనలో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మళ్లీ కోహ్లి సేన ఆధిపత్యమా... లేక లంకేయుల పోరాటమా అనేది చూడాలి.
పల్లెకెలె: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో తమ ఆధిక్యం పెంచుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఆధిక్యం 2–0కు చేరుతుంది. సొంతగడ్డపై కనీసం ఒక్క విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న శ్రీలంక ఈసారైనా తమ అదృష్టం మార్చుకోవాలని పట్టుదలగా ఉంది. 2019లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే లంక ఈ సిరీస్‌లో కనీసం 2 వన్డేలైనా నెగ్గాలి. ఇలాంటి స్థితిలో ఆ జట్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.
అదే జట్టుతో...
2019 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జట్టులో సభ్యులందరికీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలనేది భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన. అయితే సిరీస్‌లో రెండో మ్యాచే కావడంతో గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌లో మార్పులు లేకుండానే భారత బరిలోకి దిగనుంది. మీడియా సమావేశంలో విరాట్ కోహ్లి కూడా సూత్రప్రాయంగా ఇదే విషయాన్ని వెల్లడించాడు. కాబట్టి రహానే, పాండేలు మరోసారి పెవిలియన్‌కే పరిమితం కానున్నారు. బౌలింగ్ విషయంలో కూడా కుల్దీప్ యాదవ్‌కంటే అక్షర్‌కే కెప్టెన్ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్షర్‌తో పాటు తొలి వన్డేలో చహల్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు.
వీరిద్దరి బౌలింగ్ వైవిధ్యం లంక బ్యాట్స్‌మెన్‌కు మరోసారి ఇబ్బందులు సృష్టించనుంది. పార్ట్‌టైమర్‌గా జాదవ్ సత్తా చాటగా... బుమ్రా ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. అయితే కొత్త బంతితో బౌలింగ్ చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌ను ఇంకా మెరుగుపర్చుకోవాల్సి ఉంది. అతనికి ఈ మ్యాచ్ ఆ అవకాశం కల్పిస్తోంది. బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైన రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టాడు. అయితే రాహుల్, జాదవ్‌లకు మరింత ప్రాక్టీస్ కల్పించేందుకు వారి బ్యాటింగ్ స్థానాల్లో మార్పులు చేసే అవకాశం మాత్రం ఉంది. ధోనికి కూడా బ్యాటింగ్ అవకాశం రావడం ముఖ్యం.
గెలిపించేది ఎవరు?
ఒక్క విజయం కోసం శ్రమిస్తున్న శ్రీలంక వద్ద అన్నీ సమాధానం లేని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. గెలుపు కోసం ప్రయత్నించాల్సిన సమయంలో జట్టులో అభిప్రాయభేదాలు బయటపడినట్లు సమాచారం. గత వన్డేలో టెస్టు కెప్టెన్ చండిమాల్‌కు తుది జట్టులో స్థానమే లభించలేదు. ఓపెనర్ అయిన కెప్టెన్ తరంగ నాలుగో స్థానంలో బరిలోకి దిగడం కూడా అనూహ్య నిర్ణయం. కోచ్ పొథాస్, మేనేజర్ గురుసిన్హా, చీఫ్ సెలక్టర్ జయసూర్య మధ్య సమన్వయలేమి లంకను దెబ్బ తీస్తోంది. తొలి వన్డేలో శుభారంభం చేసినా... చివరి వరకు అదే జోరును కొనసాగించడంలో శ్రీలంక విఫలమైంది. పేసర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఆ జట్టు స్పిన్నర్లకు తలవంచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో కొత్త వ్యూహంతో బరిలోకి దిగాలని లంక భావిస్తోంది. బ్యాటింగ్‌లో టాప్–4 డిక్‌వెలా, గుణతిలక, కుషాల్ మెండిస్, తరంగలలో కనీసం ఇద్దరు భారీ స్కోర్లు చేయాల్సి ఉంది.
మాథ్యూస్, కపుగెడెర కూడా తమ పాత్రలకు న్యాయం చేయలేదు. బౌలింగ్‌లో ఆ జట్టు పదును పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు మలింగ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోగా... ఫెర్నాండో గత మ్యాచ్‌లోనే అరంగేట్రం చేశాడు. తిసార పెరీరాపై ఈ మ్యాచ్‌లో వేటు పడవచ్చు. అతని మీడియం పేస్ భారత్‌కు ఏమాత్రం ఇబ్బంది సృష్టించలేకపోగా... భారత్ తరహాలో ఆ జట్టు స్పిన్నర్లు ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో గెలవాలంటే లంక తీవ్రంగా శ్రమించాలి.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రాహుల్, ధోని, జాదవ్, పాండ్యా, అక్షర్, భువనేశ్వర్, బుమ్రా, చహల్.
శ్రీలంక: తరంగ (కెప్టెన్), డిక్‌వెలా, గుణతిలక, మెండిస్, మాథ్యూస్, కపుగెడెర, డి సిల్వ, సిరివర్దన, సందకన్/ధనంజయ, మలింగ, ఫెర్నాండో.
పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్ వికెట్. అయితే రెండో ఇన్నింగ్స్ సమయంలో పేసర్లకు కాస్త అనుకూలించవచ్చు. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించగలరు. మ్యాచ్ రోజున చిరుజల్లులకు అవకాశం ఉంది.
►మధ్యాహ్నం గం. 2.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం