టోక్యో: కాంస్యపు పోరులో భారత మహిళా హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు.
ఇక మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమంగా ఉండగా... నాలుగో క్వార్టర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన చివరి 15 నిమిషాల ఆటలో బ్రిటన్ తొలి గోల్ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లి గెలుపును ఖరారు చేసుకుంది. దీంతో మహిళల హాకీ చరిత్రలో తొలి ఒలింపిక్ పతకం చేరాలని ఆశించిన భారత్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలుస్తోంది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్‌కు చేరినందుకు వారి పోరాట పటిమను కొనియాడుతోంది.
కాంస్య పతక పోరులో భాగమైన భారత మహిళా హాకీ జట్టు:
సవితా పునియా(గోల్ కీపర్), గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహ, మోనిక, నవజోత్ కౌర్, నవనీత్ కౌర్, రాణి(కెప్టెన్), వందనా కటారియా.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment