టోక్యో: ఒలింపిక్స్ ప్రారంభానికి మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండగా.. జపాన్ ప్రధాని యొషిహిదె సుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని తెలిపారు. ఒలింపిక్స్ జరగనున్న టోక్యోలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని, నగరంలో బుధవారం ఒక్కరోజే 920 కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు డెల్టా, లాంబ్డా దేశంలోని ప్రవేశించే ఆస్కారం ఉన్నందున ఒలింపిక్స్ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్‌కు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్‌కు అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా అత్యయిక స్థితిని విధించిన జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు దాన్ని కొనసాగించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మహమ్మారి మరోసారి విరుచుకుపడటంతో ఈ ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
భారత అథ్లెట్లు అయోమయం..
టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి బయలదేరనున్న అథ్లెట్లు .. ఎప్పుడూ వెళతామో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ప్రయాణానికి సంబంధించిన తేదీల విషయాల్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నుంచి వేర్వేరు ప్రకటనలు రావడమే ఇందుకు కారణం. ఒలింపిక్స్‌కు సెలెక్ట్ అయిన అథ్లెట్లలో ఫస్ట్ బ్యాచ్ 17వ తేదీన టోక్యో బయలుదేరుతుందని ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వస్తే 14వ తేదీనే ప్రయాణముంటుందని ఐఓఏ నుంచి అథ్లెట్లకు ఇటీవల మెసేజ్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment