సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్‌లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్‌లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్‌లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్‌గానే రోహిత్ శర్మ! )
ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్‌సీఏ లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్‌సీఏను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment