విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్‌ చిత్తు | UAE Beat Scotland By 8 Wickets In First T20, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

UAE Vs Scotland: విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్‌ చిత్తు

Published Tue, Mar 12 2024 8:32 AM | Last Updated on Tue, Mar 12 2024 10:30 AM

UAE Beat Scotland By 8 Wickets In First T20 - Sakshi

యూఏఈతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం​ స్కాట్లాండ్‌ జట్టు దుబాయ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (మార్చి 11 జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈ స్కాట్లాండ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేయగా.. యూఏఈ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ ముహమ్మద్‌ వసీం మెరుపు ఇన్నింగ్స్‌ (43 బంతుల్లో 68 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి యూఏఈని గెలిపించాడు. 

స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో జార్జ్‌ మున్సే (49 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మైఖేల్‌ లీస్క్‌ (19), జాక్‌ జార్విస్‌ (21) రెండంకెల స్కోర్లు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖీ (4-0-14-3) అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆయాన్‌ ఖాన్‌ (4-0-19-2), బాసిల్‌ హమీద్‌ (4-0-26-2) పర్వాలేదనిపించారు. 

యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్‌ వసీంతో పాటు తినష్‌ సూరి (35 బంతుల్లో 37; 4 ఫోర్లు), అలీషాన్‌ షరాఫు (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జాక్‌ జార్విస్‌, క్రిస్‌ గ్రీవ్స్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 13న జరుగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement