పొట్టి ఫార్మాట్‌లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది.
హిట్‌మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్‌ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లు కొట్టాడు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment