
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్‌లో ఇవాళ (అక్టోబర్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మెయప్పన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల ఈ యువ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్.. లంకతో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించి యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు.
లంక ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ వేసిన కార్తీక్.. ఆఖరి మూడు బంతులకు రాజపక్స, అసలంక, షనక వికెట్లు తీసి, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కార్తీక్‌కు ముందు పొట్టి ప్రపంచకప్‌లో బ్రెట్ లీ, కర్టిస్ క్యాంపర్, వనిందు హసరంగ, కగిసో రబాడలు మాత్రమే హ్యాట్రిక్ సాధించారు.
కాగా, లంకతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించడంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కార్తీక్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. భారతీయ పేరు కలిగి ఉండటంతో మనవారు ఇంకాస్త ఎక్కువ ఆసక్తి కనబర్చి కార్తీక్ పూర్వపరాలను సేకరించారు. కార్తీక్ పళనియపన్ మెయప్పన్ మన దక్షిణాది చెందిన వాడే అని తెలిసి ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.
కార్తీక్ అక్టోబర్ 8, 2000 సంవత్సరంలో తమిళనాడులోని చెన్నై సగరంలో జన్మించాడు. కార్తీక్ కుటుంబం 2012లో దుబాయ్‌లో సెటిల్ కావడంతో.. అతను తన క్రికెటింగ్ కెరీర్‌ను యూఏఈ జట్టుతో ప్రారంభించాడు. 2019లో యూఏఈ తరఫున వన్డే అరంగేట్రం చేసిన కార్తీక్.. ఇప్పటివరకు 8 వన్డేలు. 12 టీ20లు ఆడి మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే, శ్రీలంక-యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యూఏఈ 10 ఓవర్ల తర్వాత 6 వికెట్లు నష్టానికి 36 పరుగులు మాత్రమే చేసి ఓటమి దశగా సాగుతుంది.