అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.
శ్రేయస్ అయ్యర్..

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 2025 సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్‌లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్‌కు అప్పగించారు. ఐర్లాండ్‌తో సిరీస్ కెప్టెన్‌గా అయ్యర్‌కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్‌గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్‌గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్‌తో తేలిపోనుంది.
వైభవ్ సూర్యవంశీ..

ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
అంతకముందు ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్‌లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్‌లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్‌పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్‌తో టూర్‌కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన వైభవ్‌కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్‌తో సిరీస్‌లో రాణిస్తే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.
నితీశ్‌కుమార్ రెడ్డి..

హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్‌కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్‌కుమార్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్‌రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.
రవి బిష్ణోయి..

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్‌సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లో రవి బిష్ణోయి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్‌ఫాస్ట్ వేదికగా జరగనుంది.


