మయాంక్ అగర్వాల్- వరుణ్ గౌడ్(PC: X)
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెట్ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్ గౌడ్ (82 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో హైదరాబాద్ జట్టును గెలిపించాడు.
మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ సెంచరీ
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
తిలక్ వర్మ @99
ఇక హైదరాబాద్ బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్ రాయుడులకు ఒక్కో వికెట్ లభించింది.
కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్ గౌడ్ వీరవిహారం చేశాడు.
వరుణ్ వీరోచిత శతకం
తిలక్, వరుణ్ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్ గౌడ్ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్ త్యాగరాజన్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
చివరి ఓవర్ తొలి బంతికి తనయ్ అవుటైనా... చామా మిలింద్ (4 నాటౌట్)తో కలిసి వరుణ్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే, నికిన్ జోస్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్‌గా నిలిచి హైదరాబాద్‌ను గెలిపించిన వరుణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌తో హైదరాబాద్ ఆడుతుంది.
చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
Comments
Please login to add a commentAdd a comment