ఫాస్టెస్ట్‌ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు! | VHT: This Unsold Player in IPL 2025 Slams 3rd Fastest Century in List A cricket | Sakshi
Sakshi News home page

ఫాస్టెస్ట్‌ సెంచరీ.. కసిదీరా కొట్టేశాడు!

Published Sat, Dec 21 2024 3:52 PM | Last Updated on Sat, Dec 21 2024 4:33 PM

VHT: This Unsold Player in IPL 2025 Slams 3rd Fastest Century in List A cricket

అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (PC: BCCI Domestic X)

పంజాబ్‌ బ్యాటర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. కేవలం 35 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్ట్‌- ‘ఎ’ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో శనివారం నాటి మ్యాచ్‌ సందర్భంగా అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా  గ్రూప్‌-‘ఎ’లో ఉన్న తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు.. అరుణాచల్‌ప్రదేశ్‌ తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ‘ఎ’ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

164 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ 164 పరుగులకే కుప్పకూలింది. తెచి నెరి 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్‌ వర్మ 38, ప్రిన్స్‌ యాదవ్‌ 23, దేవాన్ష్‌ గుప్త 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. పంజాబ్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే, అశ్వని కుమార్‌ మూడేసి వికెట్లు తీయగా.. బల్జీత్‌ సింగ్‌ రెండు, సన్వీర్‌ సింగ్‌, రఘు శర్మ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

అభిషేక్‌ శర్మ విఫలం
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(25 బంతుల్లో 35 నాటౌట్‌)కు తోడైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

45 బంతుల్లో 115 పరుగులు
సుడిగాలి ఇన్నింగ్స్‌తో కేవలం 35 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అన్మోల్‌.. మొత్తంగా 45 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో 12.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి 167 పరుగులు చేసింది పంజాబ్‌.

కసిదీరా కొట్టేశాడు
తద్వారా అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించి టోర్నీని విజయంతో ఆరంభించింది. తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఈ పంజాబీ బ్యాటర్‌ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వన్డేల్లో టీ20 తరహాలో ఊచకోత కోసి తన కసినంతా ఇక్కడ ప్రదర్శించాడంటూ అభిమానులు అన్మోల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ముంబై తరఫున క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌.. చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన అన్మోల్‌.. 139 పరుగులు సాధించాడు.

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement