ఆస్పత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli) ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తీవ్రమైన మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం అతన్ని భీవాండిలోని ఆకృతి హాస్పిటల్‌లో చేర్పించారు. తదనంతర వైద్య పరీక్షల్లో అతని మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని తేలడంతో ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
డాక్టర్ వివేక్ త్రివేది నేతృత్వంలోని స్పెషాలిటీ వైద్యబృందం అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. శనివారం రోజు కాంబ్లీ తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ త్రివేది తెలిపారు. అతని మెదడుకు ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే కాంబ్లీకి జ్వరం రావడంతో జ్వరం తగ్గాక స్కానింగ్ తీస్తామని అన్నారు.
చికిత్సకు మాజీ క్రికెటర్ స్పందిస్తున్నారని ఇలాగే నిలకడగా అతని ఆరోగ్యం ఉంటే 24 గంటలు గడిచాక ఎంఆర్‌ఐ స్కాన్ రిపోర్టును సమీక్షించి ఐసీయూ నుంచి రూమ్‌కు మార్చుతామని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత కూడా మరో నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వివేక్ త్రివేది వివరించారు.
మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కుమారుడు, కళ్యాణ్ లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కాంబ్లీకి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. డాక్టర్ శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందజేస్తామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment