Ind Vs Eng: టీమిండియా గెలుపుపై కోహ్లి స్పందన.. పోస్ట్‌ వైరల్‌ | Virat Kohli Social Media Post After India Series Win Over England Goes Viral | Sakshi
Sakshi News home page

Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్‌ వైరల్‌

Published Mon, Feb 26 2024 4:00 PM | Last Updated on Mon, Feb 26 2024 4:20 PM

Virat Kohli Social Media Post After India Series Win Over England Goes Viral - Sakshi

టీమిండియా సిరీస్‌ విజయంపై భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి స్పందించాడు. ఇంగ్లండ్‌పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని కోహ్లి కొనియాడాడు.

కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కోహ్లి దూరమైన విషయం తెలిసిందే. భార్య అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో అతడు తన కుటుంబానికి సమయం కేటాయించాడు.

ఈ నేపథ్యంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత కోహ్లి లేకుండా టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్‌ బరిలో దిగింది. మరోవైపు.. కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో అందుబాటులో లేకుండా పోయాడు.

ఈ క్రమంలో రెండో టెస్టులో రజత్‌ పాటిదార్‌, మూడో టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ అరంగేట్రం చేశారు. ఇక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వగా బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 

వీళ్లలో రజత్‌ పాటిదార్‌ మినహా మిగతా ముగ్గురు తమదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా విరాట్‌ కోహ్లి స్పందిస్తూ.. ‘‘అవును.. టీమిండియా గెలిచింది. అద్భుతమైన సిరీస్‌లో యువ జట్టు దేశాన్ని గెలిపించింది. పట్టుదల, అంకిత భావం.. సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే తత్వమే ఈ విజయానికి కారణం’’ అని పేర్కొన్నాడు.

కాగా హైదరాబాద్‌ టెస్టులో ఓడి పరాజయంతో సిరీస్‌ ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్‌.. తాజాగా రాంచి టెస్టులో విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

ఇక కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్‌ జన్మించిన విషయం తెలిసిందే. కుమారుడి రాక గురించి తెలియజేసే పోస్ట్‌ తర్వాత.. కోహ్లి తాజాగా టీమిండియా విజయం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

చదవండి: #Rohit Sharma: కష్టపడాల్సి వచ్చింది.. అతడు అత్యద్భుతం.. వాళ్లు లేకపోయినా గెలిచాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement