ముంబై: టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్‌లు తమదైన శైలిలో దాదాకు శుభాకాంక్షలు చెప్పడం వైరల్‌గా మారింది. '' గంగూలీ బాయి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ జీవితంలో ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని.. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. రాబోయే రోజులు అంతా మంచే జరగాలి. హ్యాపీ బర్త్‌డే దాదా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గంగూలీకి విషెస్ చెబుతూ.. ''దాదాకున్న అభిరుచిని, ఉద్దేశాలను కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. అలాంటి వారిలో నేను ఒకడిని.. హ్యాపీ బర్త్‌డే దాదా.. '' అంటూ ట్వీట్ చేశాడు.
ఇక సౌరవ్ గంగూలీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. 1992లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే మొదట్లో కొంచెం అగ్రెసివ్‌గా కనిపించిన గంగూలీ ఎక్కువకాలం జట్టులో ఉండలేకపోయాడు. ఆ తర్వాత 1996లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన గంగూలీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో టీమిండియా విఫలమైనా గంగూలీ మాత్రం సక్సెస్ అయ్యాడు. అప్పటి మూడు టెస్టుల సిరీస్‌లో రెండు వరుస టెస్టుల్లో సెంచరీలతో మెరిశాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేసిన గంగూలీ 131 పరుగులు చేసి టీమిండియా నుంచి లార్డ్స్‌లో డెబ్యూలోనే అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
కాగా 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దాదా సుడిగాలి ఇన్నింగ్స్‌ను ఎవరు మర్చిపోలేరు. 158 బంతుల్లో 183 పరుగులు చేసిన గంగూలీ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్‌తో కలిసి రెండో వికెట్‌కు 315 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇప్పటికి రికార్డుగా ఉంది. ఒక వరల్డ్‌కప్‌లో ఒక వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు కావడం ఒక విశేషం అయితే.. ఓవరాల్‌గా వన్డే చరిత్రలో రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్య పరుగుల రికార్డు జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం అనంతరం సౌరవ్ గంగూలీ టీమిండియాకు కెప్టెన్ అయ్యాడు. గంగూలీ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత టీమిండియాలో దూకుడు పెరిగింది.
2001లో ఆసీస్ భారత పర్యటన నేపథ్యంలో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా టెస్టు సిరీస్‌ను ఓటమితో ప్రారంభించినా ఆ తర్వాత ద్రవిడ్, లక్ష్మణ్, హర్బజన్‌ల రాణింపుతో అనూహ్యంగా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఆసీస్ వరుస 16 టెస్టు విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత 2002 నాట్‌వెస్ట్ సిరీస్ సందర్భంగా లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో యువరాజ్, కైఫ్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో లార్డ్స్ బాల్కనీలో ఉన్న గంగూలీ తన చొక్కా విప్పి గిరాగిరా తిప్పడం ఇప్పటికి అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది.
ఇక దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ప్రపంచకప్‌లో గంగూలీ సేన ఎవరు ఊహించని రీతిలో ఫైనల్‌కు చేరింది. కానీ ఆసీస్‌తో జరిగిన తుది పోరులో ఆఖరిమెట్టుపై బోల్తా కొట్టింది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియాకు టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిపెట్టిన ఘనత అందుకున్న గంగూలీ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిద్దాం. కాగా టీమిండియా తరపున గంగూలీ 311 వన్డేల్లో 11,363 పరుగులు, 113 టెస్టుల్లో 7,212 పరుగులు చేయగా.. ఇందులో వన్డేల్లో 22 సెంచరీలు, టెస్టుల్లో 16 సెంచరీలు ఉన్నాయి.
Dada ko Janamdin ki bahut badhai.
— Virender Sehwag (@virendersehwag) July 8, 2020
The only time he blinked his eye was when dancing down the track while hitting spinners for a 6, varna never. Eternally grateful for his support in initial days. #HappyBirthdayDada pic.twitter.com/U7k0Q9paJI
Many more happy returns of the day @SGanguly99 . May you be gifted with life’s biggest joys and never-ending bliss. Wishing you a great year ahead. #HappyBirthdayDada pic.twitter.com/O2SXZjHaMp
— VVS Laxman (@VVSLaxman281) July 8, 2021
Comments
Please login to add a commentAdd a comment