
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలు జులై 4న జరుగుతాయని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సోమవారం ప్రకటించింది. జమ్మూ అండ్ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించడంతో ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లు IOA తెలిపింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో పదవీకాలాన్ని ( 3 విడతలు, 12 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. WFI ముందుగా మే 7న ఎన్నికల తేదీని ప్రకటించింది. అయితే వివాదాల నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆ తేదీన ఎన్నిక నిర్వహించేందుకు ఒప్పుకోలేదు. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి, నూతనంగా ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది.
కాగా, గత కొద్ది వారాలుగా భారత రెజ్లర్లు WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంతో పలు చర్చల అనంతరం రెజ్లర్లు ఓ మెట్టు దిగారు. జూన్ 15వ తేదీ వరకు ఆందోళనలను చేపట్టబోమని, అప్పటివరకు తమ నిరసన ప్రదర్శనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం ముందు రెజ్లర్లు ఐదు డిమాండ్లు ఉంచారు. అవేంటంటే..
1.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.
2.అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉండకూడదు.
3. రెజ్లింగ్ పాలక మండలికి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి.
4. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజున జరిగిన ఉద్రిక్తతలలో రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి.
5.లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి.
చదవండి: డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్‌లపై వేటు..?
Comments
Please login to add a commentAdd a comment