టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా గయానా వేదికగా రేపు (భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) జరగాల్సిన భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెదర్ ఫోర్‌క్యాస్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి..?
షెడ్యూల్ ప్రకారం భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్-8 దశలో గ్రూప్ (గ్రూప్-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది.
ఒకవేళ భారత్-ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.
తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్ డే
మరోవైపు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటంతో వంద శాతం ఫలితం తేలే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment