మయాంక్‌కు గాయం.. లక్నో హీరోగా యశ్‌! ఎవరీ యంగ్‌ పేసర్‌? | Who Is Yash Thakur: LSG Pacer 5 Wicket Haul IPL 2024 Says KL Rahul Told | Sakshi
Sakshi News home page

మయాంక్‌కు గాయం.. లక్నో హీరోగా యశ్‌! ఎవరీ యంగ్‌ పేసర్‌?

Published Mon, Apr 8 2024 4:32 PM | Last Updated on Mon, Apr 8 2024 5:04 PM

Who Is Yash Thakur: LSG Pacer 5 Wicket Haul IPL 2024 Says KL Rahul Told - Sakshi

ఒకరి దురదృష్టం.. మరొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో! అరంగేట్రంలోనే సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను గెలిపించి.. రెండుసార్లు వరుసగా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు మయాంక్‌ యాదవ్‌.

తద్వారా ఐపీఎల్‌ పదిహేడేళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్పీడ్‌గన్‌. బుల్లెట్‌ వేగంతో బంతులు సంధించే ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ లక్నోను గెలిపించి.. హ్యాట్రిక్‌ అందుకుంటాడని అభిమానులు భావించారు.

కానీ దురదృష్టవవాత్తూ పక్కటెముల నొప్పి కారణంగా మయాంక్‌ యాదవ్‌ ఒక్క ఓవర్‌ మాత్రమే పూర్తి చేసి.. ఆ తర్వాత మైదానం వీడాడు. అతడి స్థానంలో వరుస ఓవర్లు బౌల్‌ చేసే అవకాశం దక్కించుకున్న యశ్‌ ఠాకూర్‌ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.

వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్‌-2024లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు.  3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి శుబ్‌మన్‌ గిల్‌(19), విజయ్‌ శంకర్‌(17), దర్శన్‌ నల్కండే(12), రాహుల్‌ తెవాటియా(30), రషీద్‌ ఖాన్‌(0) వికెట్లు దక్కించుకున్నాడు.

ఎవరీ యశ్‌ ఠాకూర్‌?
కోల్‌కతాలో 1998లో జన్మించిన యశ్‌ ఠాకూర్‌.. దేశవాళీ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రైటార్మ్‌ మీడియం పేసర్‌ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్‌-ఏ క్రికెట్‌(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.

రూ. 45 లక్షలకు కొనుగోలు
ఐపీఎల్‌-2023 వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ యశ్‌ ఠాకూర్‌ను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో కలిపి యశ్‌ 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఇది నీ రోజు అని చెప్పాడు
ఇక గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి యశ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది.

గిల్‌ను అవుట్‌ చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కేఎల్‌ రాహుల్‌ సర్‌ సలహాలతో వ్యూహాలను సరిగ్గా అమలు చేయగలిగాను. దురదృష్టవశాత్తూ మయాంక్‌ గాయపడ్డాడు. ఆ సమయంలో కేఎల్‌ రాహుల్‌ నా దగ్గరికి వచ్చి ఇది నీ రోజు.. ఉపయోగించుకో అని మోటివేట్‌ చేశాడు’’ అని యశ్‌ ఠాకూర్‌ హర్షం వ్యక్తం చేశాడు.

లక్నో వర్సెస్‌ గుజరాత్‌ స్కోర్లు:
►వేదిక: భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్‌ స్టేడియం
►టాస్‌: లక్నో.. బ్యాటింగ్‌
►లక్నో స్కోరు: 163/5 (20)
►గుజరాత్‌ స్కోరు: 130 (18.5).
►ఫలితం: 33 పరుగుల తేడాతో లక్నో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: యశ్‌ ఠాకూర్‌(5/30). 

చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్‌: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement