టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. శుబ్‌మన్ గిల్ జట్టులో ఉన్నాడనే కారణంతో రుతును పక్కనపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గిల్‌తో పోలిస్తే రుతురాజ్ ఆటలో నిలకడ ఎక్కువని పేర్కొన్నాడు. కాబట్టి అతడిపై కూడా సెలక్టర్లు కాస్త దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికాడు.
ఇద్దరికీ ఆ అర్హత
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వారసులు కాగల అర్హత ఈ ఇద్దరికీ ఉందని ఊతప్ప పేర్కొన్నాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ టీమిండియా టీ20, వన్డే జట్లకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టుకు గిల్ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచాడు.
ఈ క్రమంలో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్న గిల్‌కు శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైస్ కెప్టెన్‌గా అవకాశమిచ్చింది. టీ20లలో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మకు డిప్యూటీగా నియమించింది. ఇక టీ20లలో గిల్ యశస్వి జైస్వాల్‌తో పాటు ఓపెనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో ఓపెనర్లుగా టీ20లలో ఈ జోడీ ఫిక్సయిపోయినట్లే!.. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ ప్రమాదంలో పడింది. రుతు కూడా ఓపెనరే కావడంతో ఇప్పటికే జట్టులో పాతుకుపోయిన గిల్- యశస్వితో పోటీలో అతడు వెనుకబడ్డాడు. ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ రుతురాజ్‌కు అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు.
ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే
‘‘గిల్, రుతు.. ఇద్దరూ మంచి ప్లేయర్లే. టీ20 క్రికెట్‌లో తమకు తామే సాటి. వారి బ్యాటింగ్ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. వీరిద్దరిలో ఒకరినే ఎంచుకోవాలంటే కష్టం. అయితే, ఆటలో నిలకడ పరంగా చూస్తే గిల్ కంటే రుతురాజే ముందున్నాడని చెప్పవచ్చు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే బదులు ఇద్దరినీ జట్టులో ఆడిస్తే తప్పేంటి.
ఇద్దరూ మూడు ఫార్మాట్ల ఆటగాళ్లే. అలాంటపుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఇస్తే బాగుంటుంది’’ అని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు. అయితే, ఊతప్పతో పాటు ఈ షోలో పాల్గొన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ మాత్రం.. తాను ఈ విషయంలో గిల్‌కే ఓటు వేస్తానని చెప్పడం విశేషం.
గిల్, రుతు కెరీర్ ఇలా
కాగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్.. ఇప్పటి వరకు 25 టెస్టులు, 44 వన్డేలు, 20 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 1492, 2271, 539 పరుగులు చేశాడు. అతడి ఖాతాలో ఓ వన్డే డబుల్ సెంచరీ, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్.. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు 6 వన్డే, 23 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 115, 633 పరుగులు సాధించాడు. టీ20లలో రుతు కూడా శతకం బాదడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. రుతును ఈ టూర్‌కు ఎంపిక చేయలేదు సెలక్టర్లు.
చదవండి: భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్న యశస్వి జైస్వాల్.. తొలి బ్యాటర్‌గా రికార్డు
Manu Bhaker: రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..
Comments
Please login to add a commentAdd a comment