WI Vs Eng: రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం! | WI Vs Eng: West Indies Name Unchanged 13 Player Squad For 2nd Test | Sakshi
Sakshi News home page

WI Vs Eng: డ్రాతో నిరాశ.. అయినా మార్పుల్లేవ్‌! రెండో టెస్టుకూ అదే జట్టు.. వీరసామికి మరో అవకాశం!

Published Mon, Mar 14 2022 9:36 AM | Last Updated on Mon, Mar 14 2022 9:49 AM

WI Vs Eng: West Indies Name Unchanged 13 Player Squad For 2nd Test - Sakshi

England Tour Of West Indies 2022- నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): చివరి రోజు వరకు ఆసక్తికరంగా సాగిన ఇంగ్లండ్, వెస్టిండీస్‌ తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే. 71 ఓవర్లలో 286 పరుగుల ఊరించే విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ మ్యాచ్‌ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎన్‌క్రుమా బానర్‌ (38 నాటౌట్‌), జేసన్‌ హోల్డర్‌ (37 నాటౌట్‌), బ్రాత్‌వైట్‌ (33) రాణించారు. ఆతిథ్య జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడి గెలుపు కోసం ప్రయత్నించింది. 

అయితే 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోవడంతో వెనక్కి తగ్గిన వెస్టిండీస్‌ ‘డ్రా’పై దృష్టి పెట్టింది. నాలుగో వికెట్‌ పడిన తర్వాత బానర్, హోల్డర్‌ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా మరో 35.4 ఓవర్లు పట్టుదలగా నిలబడ్డారు. బానర్‌ 138 బంతులు ఆడగా, హోల్డర్‌ 101 బంతులు ఎదుర్కొన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 80 పరుగులు జోడించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు బుధవారం(మార్చి 16) నుంచి బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగనుంది.

ఇక ఈ మ్యాచ్‌ పాత జట్టుతోనే బరిలోకి దిగుతామని విండీస్‌ సెలక్టర్‌ డెస్మండ్‌ హేన్స్‌ స్పష్టం చేశాడు. మొదటి టెస్టు జట్టులో భాగమైన 13 మంది ఆటగాళ్లను కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన బానర్‌పై హేన్స్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట తీరు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 355 బంతుల్లో 123 పరుగులు సాధించిన బానర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు వెస్టిండీస్‌ జట్టు:
క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(కెప్టెన్‌), బ్లాక్‌వుడ్‌(వైస్‌ కెప్టెన్‌), ఎన్‌క్రుమా బానర్‌, బ్రూక్స్‌, జాన్‌ కాంప్‌బెల్‌, జాషువా డి సిల్వా, జేసన్‌ హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కైలీ మేయర్స్‌, వీరసామి పెరుమాల్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, కేమార్‌ రోచ్‌, జేడెన్‌ సీల్స్‌.

కాగా భారత సంతతికి చెందిన వీరసామికి ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. తొలి టెస్టు తుదిజట్టులో భాగమైన ఈ లెష్టార్మ్‌ స్పిన్నర్‌ 87 బంతులు ఎదుర్కొని 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చదవండి: IND VS SL 2nd Test Day 2: శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతాలో మరో రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement