ముంబై: వచ్చే నెలలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల జాబితాను మంగళవారం విడుదల చేశారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరిగే ఈ టోర్నీలో ఐదు జట్లు బరిలో ఉన్నాయి. గరిష్టంగా 90 బెర్త్‌ల కోసం మొత్తం 409 మంది క్రికెటర్లు పోటీపడనున్నారు.
ఈనెల 13న ముంబైలో మధ్యాహ్నం 2:30 నుంచి వేలం కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 1525 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోగా... చివరకు 409 మందిని ఎంపిక చేశారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లు... 163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 24 మంది క్రికెటర్లు గరిష్ట కనీస ధర రూ. 50 లక్షల విభాగంలో ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు రూ. 12 కోట్లు చొప్పున వేలంలో వెచ్చించడానికి వీలు ఉంది.
ఒక్కో జట్టు 15 నుంచి 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా ఆరుగురు విదేశీ క్రికెటర్లను తీసుకోవచ్చు. వేలం బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, షబ్నమ్, శరణ్య, నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ దీప్తి, కట్టా మహంతి శ్రీ, వై.హేమ, బారెడ్డి అనూష, చల్లా ఝాన్సీలక్ష్మీ, విన్నీ సుజన్... హైదరాబాద్ నుంచి అరుంధతి రెడ్డి, గొంగడి త్రిష, యషశ్రీ, మమత, ప్రణవి, కోడూరి ఇషిత ఉన్నారు.
చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్
.
Comments
Please login to add a commentAdd a comment