ఈస్ట్ లండన్: టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా సాగిన టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టుకు తీవ్ర నిరాశ! లీగ్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో చివరి మెట్టుపై చతికిలపడింది. ఫలితంగా ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళలు విజేతగా నిలిచారు. గురువారం జరిగిన ఫైనల్లో సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది.
వికెట్లు అందుబాటులో ఉన్నా... సఫారీ టీమ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు భారత టాప్–4 బ్యాటర్లంతా వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. ఎనిమిది బంతులాడి స్మృతి మంధాన (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (11) కూడా విఫలమైంది. హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిరాశపర్చింది. చివర్లో దీప్తి శర్మ (14 బంతుల్లో 16 నాటౌట్) స్కోరును 100 పరుగులు దాటించింది. ఎమ్‌లాబాకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టింది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment