ఆసీస్‌ బౌలర్ల విజృంభణ.. 82 పరుగులకే కుప్పకూలిన పాక్‌ | Womens T20 World Cup 2024: Australia Restricted Pakistan For 82 Runs | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఆసీస్‌ బౌలర్ల విజృంభణ.. 82 పరుగులకే కుప్పకూలిన పాక్‌

Published Fri, Oct 11 2024 9:11 PM | Last Updated on Fri, Oct 11 2024 9:11 PM

Womens T20 World Cup 2024: Australia Restricted Pakistan For 82 Runs

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 11) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. ఆష్లే గార్డ్‌నర్‌ 4, అన్నాబెల్‌ సదర్‌లాండ్‌, జార్జియా వేర్హమ్‌ తలో 2, మెగాన్‌ షట్‌, సోఫీ మోలినెక్స్‌ చెరో వికెట్‌ తీయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో అలియా రియాజ్‌ (26) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఇరమ్‌ జావెద్‌ (12), సిద్రా అమిన్‌ (12), నిదా దార్‌ (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

గ్రూప్‌-ఏ నుంచి సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలంటే పాక్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పినిసరి. అయితే ఈ స్కోర్‌తో పాక్‌ బౌలర్లు ఆసీస్‌ బ్యాటర్లను నిలువరించడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో పాక్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫాతిమా సనా లేకుండా బరిలోకి దిగింది. ఫాతిమా సనా.. తన తండ్రి ఆకస్మిక మరణవార్త తెలిసి స్వదేశానికి వెళ్లిపోయింది. పాక్‌ తదుపరి మ్యాచ్‌ ఆడే సమయానికి సనా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. 

పాక్‌ అక్టోబర్‌ 14న తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇదిలా ఉంటే, పాక్‌తో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్‌-ఏ నుంచి మరో సెమీస్‌ బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌ పోటీపడతాయి. ప్రస్తుతం గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్‌, న్యూజిలాండ్‌ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.    

చదవండి: పాకిస్తాన్‌ సెలెక్షన్‌ కమిటీలోకి మాజీ అంపైర్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement