వెంకటేశ్ అయ్యర్ (PC: BCCI/IPL)
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.
మూడో ఆటగాడిగా
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.
ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు
ఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.
అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్
ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.
అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు.
కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.
కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో
ఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.
చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు
Comments
Please login to add a commentAdd a comment