చహల్, గౌతమ్‌లకు కరోనా | Yuzvendra Chahal And Krishnappa Gowtham Test Positive | Sakshi
Sakshi News home page

చహల్, గౌతమ్‌లకు కరోనా

Published Sat, Jul 31 2021 5:20 AM | Last Updated on Sat, Jul 31 2021 7:10 AM

Yuzvendra Chahal And Krishnappa Gowtham Test Positive - Sakshi

కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్‌ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. స్పిన్నర్‌ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు శుక్రవారం కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్‌గా తేలిన కృనాల్‌ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్, దీపక్‌ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్, మనీశ్‌ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్‌ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్‌లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్‌ పాజిటివ్‌గా తేలారు. మిగిలిన టీమ్‌ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

ఆ ముగ్గురి పరిస్థితేంటి?
పాజిటివ్‌గా తేలిన కృనాల్‌ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్‌గా తేలితే భారత్‌కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు సూర్యకుమార్‌ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్‌మన్‌ గిల్, వాషింగ్టన్‌ సుందర్‌లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement