బంగ్లాదేశ్‌లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్‌కప్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్‌లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్‌లో భారత్‌లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్‌ను బీసీసీఐ తిరస్కరించింది.
అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.
కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment