పారిశ్రామికాభివృద్ధికి చర్యలు వేగవంతం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలను అధికారులు వేగవంతం చేయాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ పరిశ్రమలకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లాకు మంజూరైన పారిశ్రామిక క్లస్టర్లపై దృష్టి సారించి వాటిని త్వరగా గ్రౌండింగ్ చేయాలని చెప్పారు. ప్రింటింగ్, నోట్‌బుక్స్ తయారీ క్లస్టర్ విషయమై రెవెన్యూ, అటవీ శాఖాధికారులు ఉమ్మడిగా తనిఖీలను నిర్వహించి పురోగతి చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించాలని సూచించారు. విశ్వకర్మ పథకం ద్వారా ఎంపికై న లబ్ధిదారులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో ఎమ్మెస్సెమ్‌ఈ సర్వేను ఈ నెల 29 నుంచి నిర్వహించేందుకు గానూ క్షేత్రస్థాయి సిబ్బందికి తక్షణమే శిక్షణనివ్వాలని ఆదేశించారు. డీఐసీ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ అనూష, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డ్వామా, డీఆర్డీఏ, ఏపీఎంఐపీ పీడీలు గంగాభవానీ, నాగరాజకుమారి, శ్రీనివాసులు, కార్మిక శాఖ డీసీ వెంకటేశ్వర్లు, సభ్యులు ఏపీకే రెడ్డి, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment