
మనీ స్కామ్.. అంతా కామ్
కావలి: కావలి పట్టణాన్ని కుదిపేస్తున్న మనీస్కాం వ్యవహారంపై కొద్ది రోజుల్లోనే అ‘శుభం’ కార్డు పడనుంది. ఈ స్కామ్‌లో పోలీసులే ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు కావడంతో రాష్ట్ర పోలీస్‌శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊదాసీనత ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. ఆర్థిక నేరాలను ఆలవోకగా చేసే మహ్మద్ సుభాని మాటలు నమ్మి కావలితోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తెలంగాణలోని మక్తల్‌లో 2021లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో సుమారు రూ.70 కోట్లకు పైగా కొల్లగొట్టిన సుభాని వ్యవహారం తెలిసీ కావలిలో కొందరు పోలీసు సిబ్బంది ప్రోత్సహించడంతో అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి రూ.200 కోట్ల మేర కొల్లగొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా పాతనేరస్తుల విషయంలో నిఘా ఉంచే పోలీసు యంత్రాంగం ఇక్కడ మాత్రం ఏకంగా ఆర్థిక నేరగాడికి ఎర్ర తివాచీ పరిచి ఏజెంట్ల అవతారమెత్తడం విశేషం. సుభానిని ప్రజలు కూడా నమ్మి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు దాచుకున్న డబ్బులు, ఇంటి కోసం పొదుపు చేసుకున్న సొమ్ముతోపాటు, బ్యాంకు లోన్లు తీసుకుని, తెలిసిన వారి వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వందలాది మంది అతని వద్ద పెట్టుబడులు పెట్టారు. కేవలం ఏడాది కాలంలోనే సుమారు రూ.200 కోట్ల మేర కొల్లగొట్టాడంటే ఇది మామూలు విషయం కాదు.
ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది
మనీస్కాంపై ఒకటి, రెండు రోజుల్లో జిల్లా పోలీస్ బాస్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పది రోజుల నుంచి దర్యాప్తు సాగుతున్నా, జరిగిన స్కామ్ ఎంత, నిందితుడి వద్ద ఎంత మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు, ఇందులో పోలీసుల పాత్రపై కూడా ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఇంత వరకు నోరు మెదపకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏదోక సంస్థ పేరుతో రూ.వంద కోట్ల స్కామ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు సంస్థల వరకు హడావుడి చేస్తాయి. కానీ కావలి పరిసరాల్లోనే సుమారు రూ.200 కోట్ల స్కామ్ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చినా ఎవరి నుంచి స్పందన కనిపించకపోవడంతో ఇందులో పెట్టుబడి పెట్టిన బాధితుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈ స్కామ్‌లో పోలీసులే ప్రధాన పాత్రధారులు కావడంతో దర్యాప్తుతోపాటు ఆస్తుల స్వాధీనం అంతా కామ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో పోలీసులదే ప్రధాన పాత్ర
తిలా పాపం.. తలా పిడికెడు
ఆర్థిక నేరగాడికి అనుచరులుగా
మారిన ఖాకీలు
ఇంత పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చినా స్పందించని ప్రభుత్వం
సీఐడీ, సీబీఐ విచారణ సంస్థలతోనే అసలు న్యాయం
పోలీసు వ్యవస్థ ఇంత నిద్రాణంగా ఉందా?
మహ్మద్ సుభాని విషయంలో పోలీసు వ్యవస్థ కళ్లకు గంతలు కట్టుకుంది. ఆర్థిక నేరాల్లో ఆరితేరిన పాతనేరస్తుడు కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని సంస్థను ఏర్పాటు చేసి రూ.కోట్లు దండుకుంటున్నా, ఆరేడు నెలల క్రితమే పత్రికల్లో కథనాలు వచ్చినా సంస్థ వైపు కన్నెత్తి చూడలేదు. పైపెచ్చు పోలీసు సిబ్బందే ఏజెంట్లుగా మారి సుభానిపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వ్యవహరించారు. వీరి విషయంలో ఉన్నతాధికారులు కూడా మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment