
మమ్మీ.. డాడీ.. త్వరగా వచ్చేయండి
పెళ్లకూరు: విధి ఎంత విచిత్రమైనదో ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. సరిగ్గా గంట ముందు కుమారిడితో ముచ్చటించిన ఆ దంపతులు ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారిపోయారు. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 71వ నంబర్ జాతీయ రహదారి మార్గం దొడ్లవారిమిట్ట గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న గాను మాధవకృష్ణ (48), పొక్కల సరిత సుమంగళి (43) అనే సాఫ్ట్‌వేర్ దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథనం.. హైదరాబాద్‌లోని ఆంజనేయనగర్ ప్రాంతానికి చెందిన మాధవకృష్ణ, సరిత సుమంగళి అదే పట్టణంలోని ఓ ప్రయివేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దైవదర్శనం కోసం దంపతులిద్దరూ మూడురోజుల క్రితం కారులో బయలుదేరి శుక్రవారం అరుణాచలం గిరిప్రదక్షణ చేశారు. అదే రోజు రాత్రి తిరుమలకు వెళ్లి శనివారం తెల్లవారుజామున స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. దారిలో దొడ్లవారిమిట్ట గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి అతి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లింది. సాఫ్ట్‌వేర్ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఎస్సై నాగరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కారును స్థానికుల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
కన్నీళ్లు తెప్పించిన
కుమారుడి మాటలు
తిరుమలలో శనివారం స్వామివారిని దర్శించుకున్న మాధవకృష్ణ, సరిత సుమంగళి దంపతులకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కుమారుడు నిషాంత్ ఫోన్ చేసి మాట్లాడాడు. మమ్మీ.. డాడీ.. త్వరగా ఇంటికి వచ్చేయమని చెప్పాడు. యాక్సిడెంట్ తర్వాత పోలీసులు అతడికి ఫోన్ చేయగా ఇందాకే వారితో మాట్లాడానని బోరున విలపించాడు. దంపతులకు ఒకే ఒక కుమారుడైన నిషాంత్ 9వ తరగతి చదువుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలన్నా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. అయితే దూర ప్రయాణం కావడం, ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో నిషాంత్‌ను ఇంటి వద్ద వదిలిపెట్టి, భార్యాభర్తలిద్దరూ దైవదర్శనానికి బయలుదేరినట్టు తెలుస్తోంది.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
సాఫ్ట్‌వేర్ దంపతులు దుర్మరణం
తల్లడిల్లిన ఒక్కగానొక్క కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment