జిల్లాలో చెలరేగిపోతున్న క్రీడా మాఫియా | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో చెలరేగిపోతున్న క్రీడా మాఫియా

Published Sun, Feb 16 2025 12:02 AM | Last Updated on Sun, Feb 16 2025 12:02 AM

జిల్లాలో చెలరేగిపోతున్న క్రీడా మాఫియా

జిల్లాలో చెలరేగిపోతున్న క్రీడా మాఫియా

జిల్లాలో బోగస్‌ క్రీడల మాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ క్రీడా శాఖలో భాగమైన క్రీడా ప్రాధికార సంస్థకు సమాంతరంగా నకిలీ క్రీడా అసోసియేషన్లు, క్రీడా నిర్వాహక సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ గుర్తింపు లేని స్వయం ప్రకటిత సంస్థలు జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు, విజేతలను ఎంపిక చేసినట్లు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాయి. విద్యార్థులకు క్రీడల్లో ప్రావీణ్యం లేకపోయినా.. పేమెంట్‌ ఇస్తే చాలు అంటూ ఒక్కో ఈవెంట్‌, టోర్నమెంట్‌ పేరుతో రూ.లక్షల్లో దండుకుంటున్నాయి.

క్రీడాప్రాధికార సంస్థకు సమాంతర వ్యవస్థ

ప్రావీణ్యం వద్దు.. పేమెంటే ముద్దు

ఇండోర్‌గేమ్స్‌లో ప్రతిభ లేకున్నా

అంతర్జాతీయ స్థాయి విజేతగా సర్టిఫికెట్లు

నకిలీ క్రీడా నిర్వాహక సంస్థలతో

ప్రైవేట్‌ స్కూళ్లు మిలాఖత్‌

ఒక్కో టోర్నమెంట్‌కు

రూ.లక్షల్లో వసూళ్లు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో యోగా, కరాటే, తైక్వాండో, చెస్‌, క్యారమ్స్‌, కర్రసాము వంటి ఇండోర్‌ క్రీడలకు సంబంధించి నకిలీ క్రీడా అసోసియేషన్లు, క్రీడా నిర్వాహక సంస్థలు ఒక మాఫియాగా తయారై క్రీడలను వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్ర, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలకు సమాంతర స్థాయిలో నకిలీ అసోసియేషన్లు, నిర్వహణ సంస్థలుగా అవతరించాయి. విద్యార్థులకు ఆయా క్రీడలపై కనీస అవగాహన లేకపోయినప్పటికీ వీరు జిల్లా, రాష్ట్ర, అంతర్రాష్ట, జాతీయ స్థాయిలో విజేతలుగా ప్రకటించి ప్రశంసా వేదికలపై సర్టిఫికెట్లు అందజేస్తున్నాయి. క్రీడ, ఈవెంట్‌ స్థాయిని బట్టి అమౌంట్‌ ఫిక్స్‌ చేస్తున్నారు.

ప్రైవేట్‌ స్కూళ్లకు ప్రచారం..

విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం

జిల్లాలో దాదాపు అన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లకు క్రీడా మైదానాలు లేవు. దీన్ని అవకాశంగా తీసుకుని ఈ మాఫియా విద్యార్థులకు క్రీడల్లో ప్రావీణ్యం లేకపోయినా ఇండోర్‌ గేమ్స్‌లో విజేతలుగా ప్రకటించుకుంటూ డబ్బులు దండుకుంటుంటే.. ప్రైవేట్‌ యజమాన్యాలు గొప్పలు ప్రచారం చేసుకుంటున్నాయి. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు యజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేస్తుంటే.. ప్రతి ఈవెంట్‌ పేరుతో అదనంగా మరికొంత వసూలు చేస్తున్నారు. మరో రకంగా మీ పిల్లలకు క్రీడల్లో సర్టిఫికెట్లను, మెడల్స్‌ను ఇప్పిస్తామని వేల రూపాయలు దండుకుంటున్నారు. ఈ ఇండోర్‌ గేమ్స్‌కు సంబంధించి ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆ సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయని అవగాహన రాహిత్యంతో పిల్లలను పంపిస్తున్నారు. ఒక స్కూల్‌ నుంచి 40 నుంచి 50 మందిని సంవత్సరానికి మూడు టోర్నమెంట్లకు తీసుకెళ్తున్నారు. నేర్పించే మెంటర్‌కు ఎటువంటి అధికార పూర్వక గుర్తింపు ఉండదు. ఈ పోటీలు నిర్వహించే వారికి సంబంధిత అసోసియేషన్లు, ప్రభుత్వ గుర్తింపులు ఉండవు.

విదేశాల్లోనూ క్రీడలు

నకిలీ క్రీడా సమాఖ్యలు, అసోసియేషన్లు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోటీలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడి వ్యక్తులే అంతర్జాతీయ స్థాయి పోటీలంటూ సింగపూర్‌, శ్రీలంక, మలేసియా, లక్ష దీవులు వంటి దేశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానాలు, ఇండోర్‌ స్టేడియంలతో కూడా పనిలేకుండా ఒక హైప్రొఫెల్‌తో ఈ అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆ సర్టిఫికెట్లను తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు అంటూ ప్రభుత్వం ఇచ్చే ప్రశంసా పత్రాలకు అర్హులుగా ప్రకటించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు పంపిస్తున్నారు.

కొత్తకొత్త క్రీడా సమాఖ్యలు

నకిలీ క్రీడా సమాఖ్యలు, అసోసియేషన్ల మధ్య నగదు లావాదేవీల్లో గొడవలు రావడంతో ఎవరికి వారు ప్రత్యేకంగా కొత్త సమాఖ్యలను ఏర్పాటు చేసుకుంటున్నారు. క్రీడ ఏదైనా ఆ అసోసియేషన్‌కు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. అందుకు సంబంధించి మెంటర్లు, కోచ్‌లు, వారు నిర్వహించే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకే గుర్తింపు లభిస్తుందన్న విషయం తల్లిదండ్రులు తెలుసుకోవాలని గుర్తింపు పొందిన క్రీడా అసోసియేషన్లు చెబుతున్నాయి.

ఒక్కో గేమ్‌కు.. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌

ఒక్కొక్క స్కూల్‌ ఒక్కో ఇండోర్‌ గేమ్‌ను ఎంపిక చేసుకుని పిల్లలకు అవి నేర్పిస్తున్నట్లు ఒక పిరియడ్‌ను కేటాయిస్తున్నట్లు నమ్మ బలుకుతారు. ఇందు కోసం ఇండోర్‌ గేమ్స్‌ నేర్పించేందుకు ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను ఏర్పాటు చేస్తారు. సంవత్సరంలో వాళ్లు వేసుకున్న షెడ్యూలు ప్రకారం టోర్నమెంట్లకు పిల్లలను తీసుకెళ్తారు. ఏ మాత్రం అధీకృత లేని సంస్థలు, కొంత మంది వ్యక్తులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న క్రీడా సమాఖ్యలు ఈ టోర్నమెంట్లను నిర్వహిస్తుంటాయి. ఇందుకు సంబంధించి స్కూళ్లల్లో ఆ టోర్నమెంట్లకు వెళ్లేందుకు పిల్లల దగ్గర నుంచి క్రీడా పరికరాలు, క్రీడా దుస్తులు, భోజనాలు, వసతి అంటూ ఒక్కో పిల్లాడి నుంచి వేలల్లో దండుకుంటారు. ఆ టోర్నమెంట్‌కు వెళ్లిన ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్లు మెమెంటోలు, సన్మానాలు ఏర్పాటు చేసి పిల్లలను ఫొటోలు తీసుకుని నకిలీ క్రీడల సమాఖ్యలు ప్రచారం చేసుకుంటుంటే.. తమ విద్యార్థులు పలానా క్రీడల్లో టాలెంట్‌ చూపించారని స్కూళ్ల యాజమాన్యాలు పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటాయి. తల్లిదండ్రులను మోసం చేస్తూ విద్యా సంస్థలు చేసే నిర్వాకం పిల్లలకు ఎటువంటి క్రీడా స్ఫూర్తిని ఇవ్వకపోవడంతోపాటు ఏడాది పొడవునా డబ్బులు దండుకోవడానికి ఈ పోటీలు ఉపయోగపడుతున్నాయి.

అవగాహన పెంచుకోవాలి

ప్రైవేట్‌ స్కూళ్లల్లో నిర్వహిస్తున్న పోటీల్లో ఏవి అధికారిక పూర్వకమైనవో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఒక టోర్నమెంట్‌లో ఒక స్కూల్‌ నుంచి 30 మంది, 40 మంది పిల్లలకు ఒకేసారి మెడల్స్‌, ప్రైజ్‌లు ఎలా వస్తాయి? అనే విషయంపై దృష్టి సారిస్తే వాస్తవం తెలుసుకోవచ్చు. ఆయా క్రీడలకు సంబంధించిన వారిని సంప్రదించినా తెలుసుకోవచ్చు. బూటకపు టోర్నమెంట్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి.

– ఎస్‌కే ఖయ్యూం, యోగా అసోసియేషన్‌ ట్రెజరర్‌, ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు

రూ.వేలు దండుకుంటున్నారు

ట్రాక్‌ సూట్లు, బనియన్లు, బూట్లు అంటూ 2, 3వ తరగతి చదివే పిల్లల దగ్గర నుంచి కూడా వేలాది రూపాయలు దండుకుంటున్నారు. స్కూల్‌ వాళ్లు చెప్పారని ఆ క్రీడలకు పంపిస్తున్నాం. వాస్తవానికి ఆ వయసు పిల్లలకు వారు సేకరించే అమౌంట్‌కు సంబంధం లేదు. క్రీడల పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని తల్లిదండ్రులందరూ తెలుసుకోవాలి.

– భువనేశ్వరి, గృహిణి

అంతా డబ్బు మయం

పిల్లల టాలెంట్‌తో పనిలేదు. రాష్ట్రస్థాయి పోటీలకు తీసుకెళ్తే వాళ్లు చెప్పిన అమౌంట్‌ ఇస్తే జాతీయ స్థాయి పోటీలకు ఆపై పోటీలకు ఎంపిక చేస్తారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే టీమ్‌ అంతటికి అయ్యే ఖర్చులో కొంత మీరు పెట్టుకోండి అని ఆఫర్లు కూడా ఇస్తారు. అలా చేసిన వారి పిల్లలకే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో స్థానం కల్పిస్తారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలి.

– వెంకటేశ్వరరావు, పేరెంట్‌

నకిలీ క్రీడా సమాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement